అసమ్మతి, అసంతృప్తి రాజకీయాల్లో కామనే. టికెట్లు దొరకని వాళ్లు పార్టీపై బురదజల్లి పక్క చూపులు చూడటమూ అంతే కామన్. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే జరుగుతోంది. బీజేపీలో బీ పార్మ్ దొరకదని తెలిసిన కొందరు.. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. ఒకరిద్దరు ముందే వెళ్లిపోగా, మాజీ ఉప మఖ్యమంత్రి లక్ష్మణ్ సావడి హస్తం పార్టీలో చేరారు. వెళ్లూ, వెళ్లూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. తాను చనిపోతే శవాన్ని కూడా బీజేపీ కార్యాలయం ముందు నుంచి తీసుకెళ్లకూడదని ఆయన అన్నారు. మే 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున లక్షణ్ సావడి..అథానీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ముూడు సార్లు అదే నియోజకవర్గానికి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణ్ సావడి… 2018లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ కుమతలి చేతిలో ఓడిపోయారు. తర్వాత మారిన పరిణామాల్లో మహేశ్, బీజేపీలో చేరారు. ఇప్పుడు వారిద్దరూ ప్రత్యర్థులుగానే రంగంలో ఉన్నారు.
కార్యకర్తలు ముఖ్యం..
ఎంతమంది నేతలు వెళ్లిపోయినా…శక్తిమంతమైన పార్టీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. బీజేపీ కూడా అంతే. ఎందుకంటే బీజేపీకి కేడర్ బలముంది. గత ఎన్నికల్లో కూడా కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అంతకముందు కూడా అధికారంలో ఉంది. అదీ రాత్రికి రాత్రి వచ్చిన బలం కాదని అర్థం చేసుకోవాలి. 1980లో బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి కర్ణాటకలో ఆ పార్టీకి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వచ్చింది. కన్నడ జనం ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. క్రమంగా బీజేపీకి కేడర్ బేస్ బాగా పెరిగింది. బీజేపీ విధానాలు నచ్చి జనం ఆ పార్టీ పట్ల ఆకర్షితులై, కేడర్ గా చేరేందుకు ఇష్టపడ్డారు, కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంది..
బొమ్మాయ్ చెప్పిందీ అదే..
కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మాయ్ చెప్పింది కూడా అదే. తామకు బలమైన కేడర్ ఉందని ఆయన అన్నారు. కొంతమంది నేతలు వెళ్లడం ఇబ్బందిగా అనిపించిందని ఆయన ఒప్పుకున్నారు. ఇంతకాలం వాళ్లతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఎవరు వెళ్లినా పార్టీకి ఇబ్బంది లేదని ఆయన తేల్చేశారు. పార్టీకి కావాల్సింది కేడర్ అని, పార్టీకి ప్రాణవాయువు అందించేదీ వాళ్లేనని ఆయన ప్రకటించారు. నిజానికి బొమ్మాయ్ ప్రకటన బీజేపీ నేతలు, కేడర్ కు ఒక టానిక్ లా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎన్నికల వేళ ఒకరిద్దరు వెళ్లిపోవడంతో వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించే ప్రత్యర్థి పార్టీల దూకుడుకు బొమ్మాయ్ ప్రకటనతో చెక్ పెట్టినట్లయ్యింది..