Maheshwar Reddy: బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి..? అసలు క్లారిటీ ఇదే..

Maheshwar Reddy: టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ జోరుగా చర్చ సాగుతోంది. నిర్మల్‌లో తన అనచరులతో మహేశ్వర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మీటింగ్‌ హాల్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. ఈ కీలక సమావేశంతో మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం ఊపందుకుంది.

గత కొంతకాలంగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు రేవంత్ రెడ్డి తీరుపై మీడియా వేదికగా బహిరంగంగా తీవ్ర విమర్శలు కురిపించారు. రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్ నేతలందరినీ ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. రేవంత్ రెడ్డికి పోటీగా ఇటీవల మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేయగా.. అధిష్టానం మధ్యలోనే ఆపేయాల్సిందిగా ఆదేశాలు చేయడం ఆయనలో అసంతృప్తిని మరింత రగిల్చింది. దీంతో అధిష్టానం తీరుపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని పలుమార్లు మీడియాలో వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. కానీ ఆ వార్తలన్నీ ఉట్టి ప్రచారమేనని తేలింది. తాజా సమావేశంతో మరోసారి మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. కొంతమంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆయన పార్టీ మారుతున్నారంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టడం కలకలం రేపింది. ఎల్లుండి మహేశ్వర్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారని వాట్సప్ స్టేటస్‌లు పెడుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. తనపై కావాలనే కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. అధికార పార్టీపై సొంత పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు సొంత పార్టీపై విమర్శలు చేస్తుండటంతో.. ఆయన కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారని కొంతమంది చర్చించుకుంటున్నారు.

ఇక మరో బీఆర్ఎస్ నేత సత్యనారాయణ గౌడ్ కూడా బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన కూడా బీజేపీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం లేదని కొంతమంది కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న మహేశ్వర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.