స్టీల్ ప్లాంట్ రాజకీయంలో భారీ ట్విస్ట్ – విశాఖకు రాహుల్ గాంధీ..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. తెలంగాణ అధికారులు ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చలు ప్రారంభించారు. బిడ్ దాఖలుకు ఉన్న అవకాశాలను పరిశీలన చేస్తున్నామని.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ విశాఖ రానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు సాగుతున్న ఉద్యమంలో పాల్గొనున్నారు.

ప్లాంట్ ఆఫర్ ఇదీ:విశాఖ స్టీల్ ప్లాంట్ లో ‘కావేరి’ పేరుతో ఉన్న బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నర కాలంగా మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్ లు నడిపేందుకు అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే… దానికి బదులుగా తయారుచేసిన స్టీల్‌ని ఇస్తాం.. అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తితో ఉంది. కానీ, మొత్తంగా ప్లాంట్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

రంగంలోకి రాహుల్ గాంధీ:ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విశాఖ వస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమంలో రాహుల్ పాల్గొంటారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రతీ అడుగులోనూ కాంగ్రెస్ ప్రమేమం, భాగస్వామ్యం ఉందన్నారు. 22 వేల మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధిని దెబ్బ తీసే ఎలాంటి చర్యలను కాంగ్రెస్ అంగీకరించదని స్పష్టం చేసారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం మాట్లాడకపోవటాన్ని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు మూలధన పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందకొస్తుంటే ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏంటని నిలదీసారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ 3500 కోట్ల పెట్టుబడి పెద్ద కష్టమా అని రుద్రరాజు ప్రశ్నించారు. రాహుల్ విశాఖకు వస్తే ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ ప్రభుత్వ వాదన ఇలా:ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు ఆంశంపై పలు సూచనలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్‌ మీడియా ముందు వెల్లడించిన అభిప్రాయాలనే ఢిల్లీలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వివరించారని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీ అని… ఆ పార్టీ వేసే రాజకీయ ఎత్తుగడలు ఏమిటో తమకు తెలియవని సజ్జల అన్నారు. స్టీల్‌ ప్లాంటు విషయంలో తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. అటు తెలంగాణ అధికారులు స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తే..రాజకీయంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.