యూపీలో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ ఏడాది పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల సదస్సు పెట్టి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు యూపీలో కొత్త కొత్త కంపెనీలు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అయోధ్యలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మరో రికార్డు నెలకొల్పేందుకు యోగీ ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ ఏడాది జూలైలో అంటే తొలకరి వర్షాలు మొదలుకాగానే రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్దాయిలో 35 కోట్ల మొక్కలు నాటేందుకు యోగీ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. అదీ ఒకే రోజు ఈ మొక్కలన్నీ నాటేలా ప్లాన్ చేస్తున్నారు. వాతావారణ మార్పుల దుష్ప్రభావం రాష్ట్రంపై పడకుండా ఉండేందుకు ఈ భారీ కార్యక్రమం చేపడుతున్నట్లు యోగీ చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ వాతావరణ మార్పుల సదస్సును ఆయన ప్రారంభించారు.
భారత్ ఎప్పుడూ పర్యావరణ అనుకూల సంప్రదాయాల్నే పాటిస్తుందని, అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య సమతౌల్యం కాపాడుతుందని సీఎం యోగీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధి తప్పనిసరి అని కానీ అదే సమయంలో పర్యావరణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ అంతే ముఖ్యమని యోగీ తెలిపారు. తమ స్వార్ధం కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తే అది మరో రూపంలో మనల్ని దెబ్బతీస్తుందని యోగీ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న దుష్ప్రభావాల్ని యోగీ గుర్తుచేశారు.