ప్రియమైన శ్రీ కేటీఆర్ గారికి, వాస్తవ వివరాలతో ఈ లేఖతో సమాధానం #KTRBRS మీ తెలుపుతున్నాను అంటు సోషల్ మీడియా వేదికగా బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాటం సరే కేటీఆర్ – నిజాం షుగర్స్ నుంచి అల్విన్ వరకూ తమరిచ్చిన “తెరిపించుడు” హామీలు గుర్తున్నాయా ?
గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో కొండలు తీస్తానని బయలుదేరినట్లుగా
ఉంది మీతీరు.
తెలంగాణ తల్లిని వదిలేసి తెలుగు వారి హక్కులంటున్న కేటీఆర్ గారిని చూస్తే జాలేస్తోంది !
వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ కుట్రలాగా కనిపిస్తోందా ?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు అర్థం కాకపోతే కుట్ర ఉన్నట్లేనా ?
ఆల్విన్ కంపెనీ,ఆజాంజాహీ మిల్లు వీటి సంగతేంటి ?
సింగరేణితో కలిసి సొంతంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెడతామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి ?
నిజాం షుగర్స్ ప్రారంభిస్తామని ఓట్లు దండుకుని ఇంకా ఎందుకు ప్రారంభించలేదు ?
కోసం పోరాటాలు చేసి ఓట్లు కొట్టేసి ఇప్పుడు ఆ కంపెనీల కబ్జాలకు గురవుతున్న మీ ప్రభుత్వం పట్టించుకోదు.
హైదరాబాద్ చుట్టుపక్కల అమ్ముతున్న వేల ఎకరాల సొమ్ముతో ఇండస్ట్రీలు ఎంందుకు ప్రారంభించరు ?
నిమిదేళ్లలోనే దాదాపు 13 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎందుకు తెరిపించరు ?
మీ అండ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఆయా పరిశ్రమల కార్మికులకు ఏం చెబుతారు ?
తెలంగాణ ప్రజల సంపద దోచుకుని జైలుకెళ్లే పరిస్థితి వచ్చే సరికి స్టీల్ ప్లాంట్ తెలుగువారి హక్కు అయిందా ?
ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏమీ కానీ కేటీఆర్ ఇలాంటి చిల్లర లేఖల వల్ల మీడియాలో ప్రచారం వస్తుందేమో కానీ బండారం అంతా బయటపడుతుంది !
గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో కొండలు తీస్తానని బయలుదేరినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యవహారం. విశాఖ ఉక్కు – తెలుగువారి హక్కు అంటూ ఆయన రాసిన లేఖ చూస్తూంటే పాపం అనిపించక మానదు. తెలుగు తల్లి ఎక్కడ ఉందని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుని చివరికి ఇప్పుడు తెలుగువారు అంటూ సెంటిమెంట్ కలుపుకునే ప్రయత్నం చేసే కష్టం ఏ పగవాడికీ కూడా రాకూడదని కోరుకుంటా. ఈ నయా సెంటిమెంట్ గురించి చివరిలో చెప్పుకుందాం. ఇప్పుడు కేటీఆర్ రాసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేఖ .. అందులో ఉన్న దురుద్దేశాలు.వాస్తవాలు, దుర్భుద్ది రాజకీయాలు, అంతకు మించి ఎక్కడో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడతానంటున్న ఆయన… అసలు తెలంగాణలో ఏం చేస్తున్నారో చెప్పుకుందాం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని చెప్పారు.. ఎన్ని చేశారు ? మూతపడ్డ పరిశ్రమలను తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెరిపిస్తామని ఉద్యమ టైంలో, ఎన్నికల మేనిఫెస్టోలో హామీల మీద హామీలిచ్చిన కేసీఆర్ , కేటీఆర్ ఒక్కటంటే ఒక్క పరిశ్రమను అయినా తెరిపించారా ? . అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయినా పట్టించుకోవడం లేదు. నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ఆల్విన్, ఇట్లా ఎన్నో పరిశ్రమలు ఖాయిలా పడటంతో ఎందరో కార్మికులు రోడ్డునపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి సుమారు 1,600 వరకు మధ్య తరహా కంపెనీలు, 3 వేల వరకు చిన్న కంపెనీలు మూతపడ్డాయి. రాష్ట్రం వచ్చిన ఈ ఎనిమిదేళ్లలోనే దాదాపు 13 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని రికార్డులు చెబుతున్నాయి. కరోనా టైంలో సర్కారు నుంచి సాయం లేక, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేక పారిశ్రామిక వేత్తలు వీటిని బంద్ పెట్టారు. ఏడున్నరేండ్లలో మూతపడ్డ పరిశ్రమల వల్ల సుమారు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరి గురించి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.
సమైక్య రాష్ట్రంలో మూతబడిన కమాలాపూర్ రేహన్సు ఫేక్టరీ, ఆల్విన్ కంపెనీ, లాంటి కంపెనీని పునరుద్ధరిస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీలు ఇచ్చింది నిజం కాదా ? ఈ ఎనిమిదేళ్లలో వాటిని తెరిపించాడనికి చేసిన ప్రయత్నాలేమిటో వారు చెప్పగలరా ? నిజాం షుగర్స్, ఆజాంజాహీ మిల్లును కూడా తెరిపిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఉద్యమ సమయంలో , ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో వీటి గురించే ప్రచారం చేసింది. స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లోనూ ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోపు నిజాం షుగర్స్‌పై నిర్ణయం తీసుకుంటామని బోధన్ వేదికగా అప్పట్లో ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను మూలకుపడేశారు. ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తేవడంతోపాటు దీనిపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులు, దీన్నే నమ్ముకున్న రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఈ విషయమే మర్చిపోయారు. ఇప్పటికి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటుచేసినా ఫ్యాక్టరీ ఊసెత్తడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతంలో పలుమార్లు పర్యటించిన కేసీఆర్ ఎప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీపై తానిచ్చిన హామీని ప్రస్తావించలేదు. కవిత కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించడం సాధ్యం కాదని సంకేతాలు ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే ముందు.. తెలంగాణ ప్రజలకు చేసిన ఈ అన్యాయం గురించి తండ్రీ కొడుకులు మాట్లాడగలరా ?
మూతపడిన పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలను తెరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ఉద్యమంలో ఉదరగొట్టారు. కార్మికులకు కంపెనీల్లో ఉపాధి దొరుకుతుందని. నిరుద్యోగులకు కొలువులు వచ్చే చాన్స్ ఉంటుందని యువతను ఆశ పెట్టారు. నిజాం షుగర్స్ లాంటి పరిశ్రమలను తెరిస్తే రైతులు ఎక్కడికో వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదని మభ్యపెట్టారు. పంటకు గిట్టుబాటు వస్తుందని నమ్మించారు. కానీ ఇప్పటి వరకూ షుగర్ ఫ్యాక్టరీని తెరిచే ప్రయత్నం ఎందుకు చేయలేదు. అజాంజాహి మిల్లుదీ అదే పరిస్థితి. వరంగల్‌లో 202 ఎకరాల స్థలంలో ఆజంజాహీ మిల్లు 1990లో ఇది మూతపడింది. మిల్లును తెరిపిస్తామని ఎంత నమ్మించారో … చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ స్థలాలను స్వాహా చేసేశారు కానీ మిల్లును తెరిపించలేదు. ఇక డీబీఆర్ మిల్స్ పరిస్థితీ అంతే. లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న ఈ ఫ్యాక్టరీ కి 1992 ఫిబ్రవరిలో ఫ్యాక్టరీకి తాళం వేశారు. మళ్లీ తెరిపిస్తామని చెప్పి ఇంత వరకూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. . సిర్పూర్ –-కాగజ్ నగర్ పేపర్ మిల్లును తప్ప ఏ ఒక్క దాన్ని కూడా రాష్ట్ర సర్కారు తిరిగి తెరిపించలేదు. కనీసం ప్రయత్నాలు చేయలేదు. దానికి కేసీఆర్, కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు ?
అల్వీన్ కంపెనీ విషయంలో అదే జరిగింది. 15వేల మంది పనిచేసే అల్వీన్ కంపెనీ 1981లో జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీని ప్రారంభించారు. 1994లో అల్విన్ సంస్థ మూతపడింది.. అనంతరం దీన్ని మూసేశారు. వీటన్నింటినీ తెరిపిస్తామని చెప్పి ఎందుకు తెరిపించలేకపోయారు. చెప్పే ధైర్యం కేటీఆర్, కేసీఆర్‌కు ఉందా ? హైదరాబాద్ శివారులో లక్షలకోట్లు భూములు అమ్మి ఏం చేస్తున్నారు ? ఈ పరిశ్రమలను ఆ భూములు అమ్మి ఎందుకు తెరిపించడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కన భూదందాల్లో టీఆర్ఎస్ నేతలు ఆరితేరిపోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇంతగా కంగారు పడుతున్న కేటీఆర్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని సొంతంగా పోయిన డాంబికాలు ఎటుపోయాయి. బయ్యారం ఉక్కు కోసం ఎనిమిదేళ్లుగా బీఆర్ ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది . అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని నిపుణులు తేలిస్తే.. మీ నాయన కేసీఆర్ గారు ఏమన్నడో తెలుసా కేటీఆర్ ” కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా’అని ప్రకటించింది. ఇలా ప్రకటించి ఎంత కాలమైందో కూడా మర్చిపోయి ఉంటారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ ప్రకటన చేశారు. కేంద్ర సహకారం లేకుండానే సింగరేణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర వనరులతోనే ప్రారంభం చేసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా సింగరేణి, టీఎస్ ఎండీసీ తెలంగాణ ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతుందని మంత్రి హోదాలో కేటీఆర్ మాట్లాడిన విషయం వాస్తవం కాదా..? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పిన విషయం మరిచిపోయారా..? తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్లాంట్ ఏర్పాటు చేసి 15వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేటీఆర్ వాగ్దానం ఎక్కడికి పోయిందో చెప్పాల్సి ఉంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ లేఖలో చేసిన ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేకుండా తమకు అలవాటైన ఆరోపణలు చేస్తూ.. తెలుగు సెంటిమెంట్ పేరుతో ఏపీలోనూ అడుగు పెట్టాలన్న ఓ రాజకీయ కుట్రతో విషం చిమ్మే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అనేది కేంద్రం స్పష్టంగా చెప్పింది. ప్రైవేటీకరణ అంటే అక్కడి నుంచి ఫ్యాక్టరీని తరలించేస్తున్నట్లుగా ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్లుగా భ్రమలు కల్పించి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజకీయ పార్టీలు చేతకానివన్నట్లుగా తామే పెద్ద రాజకీయ పోటుగాళ్లమన్నట్లుగా షో చేసుకుంటూ లేఖ రాశారు. కేటీఆర్ లేఖను బట్టి చూస్తే.. అదే అర్థం అవుతుంది. అక్కడి కార్మిక సంఘాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందట.. ఇప్పటిదాకా వారికి అక్కడ పార్టీలేమీ అండగా లేవా ? స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ మిత్రులకు ఇస్తున్నట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియమ నిబంధనల ప్రకారం ఉంటే కేటీఆర్ కూడా బిడ్ లో పాల్గొనవచ్చు. ఎవరు కాదన్నారు. ప్రధాని ఆదాని, అంబానీ లకు కట్టబెట్టడానికి ఆయనకు వారసత్వం లేదు కాని మీ కుటుంబం కేటీఆర్ , కవిత , కేసీఆర్ నయా అంబానీలైపోయారని తెలంగాణ సమాజం కోడై కూస్తోంది. వాస్తవం మీకు తెలియాలి. మీరు నిజాయితీపరుడు దేశభక్తుడు ప్రపంచ నేతగా ఏదిగిన ప్రధాని మెడీగారిని అవినీతి పరుడు అని ప్రచారం చేస్తున్నారు. దానిని ప్రజలు నమ్మరని మీకు తెలుసు. దేశంలో నేడు అన్ని రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇచ్చేంత స్థాయికి ఎదిగారని చెప్పుకుంటున్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని అనుకుటే కేటీఆర్ ఈ బిడ్‌లో పాల్గొంటే అసలు నిజం తెలుస్తుంది. కనీసం తన బినామీలతో అయినా ప్రయత్నిస్తే.. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు.. ఎంత మేర జరుగుతుందన్నది తెలుస్తుంది. అలా కూడా కాదంటే తెలంగాణ ప్రభుత్వమే బిడ్‌లో పాల్గొనవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవని చెప్పడం కంటే అమాయకత్వం ఏమీ ఉండదు. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉన్న విషయాలు కేటీఆర్‌కు అర్థం కాకపోతే ఇంకెవరికీ అర్థం కావా ? నిందలేయడానికి అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టడానికి తెలుగు సెంటిమెంట్‌ను ఉద్యమం పేరుతో ఎంత తిట్టినా ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ కురిపిస్తే అక్కడి ప్రజలు ఓట్లేస్తారని ఏపీ ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడని కేటీఆర్ రాజకీయ అమాయకత్వానికి ఈ లేఖ నిదర్శనంగా కనిపిస్తోంది.
నీళ్లు , నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణను ఎంతగా నాశనం చేశారు మీ పాలనలో అక్కడి ప్రజలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.
కాళేశ్వరం పేరుతో నీళ్లతోనే వేల కోట్ల అవినీతి పంట పండించుకున్నారు. ధరణి పేరుతో చేస్తున్న భూదందా గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నియామకాల పేరుతో పేపర్లు లీక్ చేసి యువత భవిష్యత్‌తో ఆడుకున్న వైనం కళ్ల ముందే ఉంది.
తెలంగాణ ప్రజలే వచ్చే ఏన్నికల్లో మీ పాలన అవసరం లేదని వ్యతిరేక ఓటుకు సిద్ధపడుతూంటే… విశాఖ ఉక్కు – తెలుగు ప్రజల హక్కు అంటూ వస్తే అక్కడా అదే పరిస్థితి ఎదురవుతుంది.
ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి? అన్నట్లుగా బీఆర్ఎస్ ఎక్కడ అడుగుపెట్టినా జరిగేది అదే.
మీ నేతలు అవినీతి అక్రమాలు బయటపడే సమయానికి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నంత ఈజీ కాదు ప్రైవేటీకరణ చేస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేసి ఓట్లు కొట్టేయడం.
ఎందుకంటే ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు. అది తెలంగాణలో అయినా ఏపీలో అయినా. అందుకే జారిపోతున్న కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకోండి.. కాకపోతే కాస్త నిజాయితీగా రాజకీయాలు చేయండి. లేకపోతే దేశంలోనే అత్యంత తక్కవ సమయంలో రాజకీయ ముగింపును పలికిన పార్టీగా ప్రజల చేతుల్లో త్వరలో సమాధానం లభిస్తుంది.