PM Narendra Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ (PM Modi Telangana Tour)లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ వర్గాలకు సమాచారం అందింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని తెలుస్తోంది.
అదే రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ఆధునికీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.700 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. అనంతరం తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.
రెండు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. అందువల్ల వర్చువల్ వేదికగా సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ రైలును ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాలకు రెండో వందే భారత్ రైలును కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో నడిచే ఈ రైలును.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత పార్టీ కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుందని సమాచారం. ఈ సభకు పెద్దఎత్తున జన సమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒకే ఒక్క వందే భారత్ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్, విశాఖపట్టణం మధ్య రాకపోకలు సాగిస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి రైలు ప్రారంభమైతే.. అది తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలు అవుతుంది.