ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణకు కారణమవుతున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సభ్యులే టీడీపీకి అనుకూలంగా ఓటు వేసారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరినీ పార్టీ గుర్తించింది. పలువురు ఎమ్మెల్యేలతో టీడీపీ టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. ఇద్దరితో క్రాస్ ఓటింగ్ చేయించటంలో మాత్రం సక్సెస్ అయింది. ఫలితంగా వైసీపీ ఒక అభ్యర్ధి ఓటమి పాలయ్యారు.
ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీకి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీ తమ అభ్యర్ధిని బరిలోకి దించిన సమయం నుంచి క్రాస్ ఓటింగ్..రెబల్స్ గురించి చర్చ మొదలైంది. వైసీపీ ముందస్తు చర్యలు తీసుకుంది. ఏడుగురు అభ్యర్ధులకు కావాల్సిన ఎమ్మెల్యేలతో టీంలు ఏర్పాటు చేసింది. సీనియర్లకు వారి బాధ్యతలు అప్పగించింది. ఆనం – కోటంరెడ్డి మినహా మిగిలిన వారంతా పార్టీతోనే ఉన్నారనే నమ్మకంతో ఉంది. తమ ఏడుగురు అభ్యర్దులు గెలుస్తారని ఆశలు పెట్టుకుంది. కానీ, పార్టీ అభ్యర్ధి ఓటమి కంటే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేయటం ఇప్పుడు వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.
టీడీపీ అభ్యర్దికి సహకరించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనే దాని పైన అనేక పేర్లు తెర పైకి వచ్చాయి. అందులో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్ల పైన ప్రచారం సాగింది. కానీ, ఉండవల్లి శ్రీదేవి తాను పార్టీకే కట్టుబడి ఓటు వేసానని స్పష్టత ఇచ్చారు. తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించిన దాఖలాల్లేవ్. పైగా వైసీపీ పెద్దల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదట. కొన్నిసార్లు ఫోన్ స్విచాఫ్ అని కూడా వస్తోందట. కనీసం రిటర్న్ కాల్ కూడా రాకోవడంతో అధిష్ఠానం అనుమానమే నిజమేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని అధిష్ఠానం నియమించడంతో మేకపాటి చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీకి ఓటు వేసి ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరినీ గుర్తించామని వెల్లడించారు. వారి పేర్లు చెప్పటానికి నిరాకరించారు. వారి పైన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని చెప్పుకొచ్చారు. ప్రలోభ పెట్టటం చంద్రబాబుకు తెలిసన రాజకీయమేనన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు ప్రపంచ ఛాంపియన్ అన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. జగన్…వైసీపీ అందులో పోటీ పడలేదని సజ్జల వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..వరుసగా గ్రాడ్యుయేట్స్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఫలితాలతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలే నాయకత్వాన్ని ధిక్కరించటం అసలు సవాల్ గా మారుతోంది.