ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ – టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసారు. టీడీపీ అభ్యర్దికి మద్దతుగా ఓట్లు వేయటంతో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీతో ఉన్నట్లుగా వైసీపీ గుర్తించింది. తాజాగా క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో నెల్లూరు జిల్లా నుంచే మరో ఎమ్మెల్సీ పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో ఎంట్రీకి ముందుగా ఆయన సోదరుడు ఈ రోజు టీడీపీలో చేరనున్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి ఇవాళ టీడీపీలో చేరుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటుగానే సోదరుడు కూడా వైసీపీకి దూరమయ్యారు. గిరిధర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. కొద్ది రోజుల క్రితం పార్టీ క్రమశిక్షణా సంఘం సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. కోటంరెడ్డి సోదరులు టీడీపీతో కలిసి పని చేయాలని డిసైడ్ అయినా.. శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ముందుగా గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరటం ద్వారా కోటంరెడ్డి బ్రదర్స్ ముందుగా నియోజకవర్గంలో టీడీపీ యాక్టివిటీలో భాగస్వాములు కానున్నారు. ఆ తరువాత ఎమ్మెల్సీ శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నారు. వైసీపీ తమ అభ్యర్దులకు ఓట్లు కేటాయించిన సమయంలోనే ఆనం – కోటంరెడ్డిని మినహాయించింది. ఆ ఇద్దరు టీడీపీకే ఓట్లు వేస్తారనే నిర్ణయానికి వచ్చింది. ఇక ఓటింగ్ తరువాత కోటంరెడ్డి తాను ఆత్మప్రభోదానుసారం ఓటు వేసానని చెప్పుకొచ్చారు. ఫలితాల సమయంలో టీడీపీకి వైసీపీ నుంచి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లు క్లారిటీ వచ్చింది. అందులో కోటంరెడ్డి కూడా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలుపుతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తమ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. దీని ద్వారా.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా ఓటు వేసి ఉంటారనే అనుమానాలు మరింత పెరిగాయి.
ఇప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరే వేళ..నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. నెల్లూరు భారీ ప్రదర్శన నిర్వహించి..నేరుగా టీడీపీ కార్యాలయంకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు. గిరిధర్ రెడ్డితో పాటుగా మరికొందరు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. భారీ ర్యాలీగా నెల్లూరు నుంచి టీడీపీ ప్రధాన కార్యాలయం చేరుకోనున్నారు. నెల్లూరు వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఆ జిల్లాలోనే వైసీపీ నేతలు టీడీపీ వైపు ఆసక్తి చూపుతున్న వారి జాబితాలో మరో సీనియర్ నేత పేరు వినిపిస్తోంది. తాజా ఫలితాలు..సమీకరణాలతో వైసీపీ నాయకత్వం నెల్లూరు పార్టీ వ్యవహారాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.