అమరావతి/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం నుంచి తీరిక లేని కార్యక్రమాలతో గడిపారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మోదీ వద్ద ప్రస్తావించారు. పోలవరం నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి మాట్లాడారు.
తెలంగాణతో నెలకొని ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1,42,601 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల విభజన పూర్తి కావట్లేదని, ఉమ్మడి రాష్ట్రంలో మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత- సంవత్సరాలు గడుస్తోన్నప్పటికీ.. ఆస్తుల విభజన మాత్రం పూర్తికావట్లేదని వివరించారు.
తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని జగన్ పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు.
అమిత్ షాతో భేటీ మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. అవే అంశాలను ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అనంతరం ఆయన పార్లమెంట్ కు బయలుదేరి వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి, ఇతర వైసీపీ ఎంపీలు ఆయనకు ఆహ్వానం పలికారు.
అదే సమయంలో లాబీల్లో- జగన్ ను మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, ఒకప్పటి నటి నవనీత్ కౌర్ మర్యాదపూరకంగా కలిశారు. ఆయనతో ఫొటో దిగారు. జగన్ తనకు స్ఫూర్తినిచ్చారని వ్యాఖ్యానించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి లోక్ సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. శివసేనకు చెందిన ఆనంద్ రావ్ అడ్సల్ ను ఆమె భారీ మెజారిటీతో ఓడించారు.
జగన్.. సుదీర్ఘ విరామం తరువాత పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టారు. ఆయన రాజకీయ అరంగేట్రం లోక్ సభ సభ్యుడిగానే ఆరంభమైన విషయం తెలిసిందే. 2009లో కడప నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. 2011లో అదే కడప లోక్ సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రికార్డు స్థాయి మెజారీటీ- 5,45,672తో తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారాయన.