Avinash Reddy: ‘అప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు’.. హై కోర్టు కీలక ఆదేశాలు..

సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలంటూ.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్‌ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి కోర్డు సానుకూలమైన తీర్పు ఇచ్చింది. సోమవారం వరకు తనను సీబీఐ అరెస్ట్ చేయదని హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ, తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ ఆయన ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐకి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయదని ఆయనకు తెలియజేసింది. ఇదిలా ఉండగా మరోవైపు సీబీఐ వరుసగా మూడోసారి ఆయనను ఈ రోజు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణ జరుపుతోంది.

కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని కోరారు. ఇంకా వివేక హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్న అవినాష్‌.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ వ్యతిరేకించాలన్నారు. దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతోందని అవినాష్‌ అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాధారాలు లేకపోయినప్పటికీ.. కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్‌ ఆరోపించారు. వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారి తీరు పారదర్శకంగా లేదని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.