Telangana: రాజ్‌భవన్ Vs ప్రగతిభవన్.. పీక్స్‌కు చేరిన వార్.. సుప్రీంకు బిల్లుల పంచాయితీ..!

రాజ్‌భవన్‌ Vs ప్రగతిభవన్‌. ఈ వార్‌ మరో లెవల్‌కి వెళ్లబోతోంది. గవర్నర్‌ తీరుపై సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం..

రాజ్‌భవన్‌ Vs ప్రగతిభవన్‌. ఈ వార్‌ మరో లెవల్‌కి వెళ్లబోతోంది. గవర్నర్‌ తీరుపై సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌లో దీనిపై నిర్ణయం జరిగింది. పేదలకు ఇళ్లు, దళిత బంధు అమలులోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్‌. ఏడాది నుంచి కీలక బిల్లులు ఆపడంపై.. గవర్నర్‌ తమిళిసైపై న్యాయ పోరాటానికి దిగుతోంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీలో ఆమోదం పొందిన పది బిల్లులు ఇంకా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్‌ ప్రసంగం అంశంలో రాజీ కుదిరినా బిల్లులపై మాత్రం గవర్నర్‌ ఎటూ తేల్చడం లేదు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది కేబినెట్‌. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో బిల్లులు పెండింగ్‌ పెట్టడంపై చర్చ జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్లి దీన్ని తేల్చుకోవాలని నిర్ణయించింది కేబినెట్‌.

మరోవైపు రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధును ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. హుజూరాబాద్‌ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో లబ్దిదారులను వెంటనే గుర్తించి పది లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు గృహ లక్ష్మి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో 3వేల చొప్పున 4 లక్షల మంది పేదలకు ఇళ్లు కేటాయిస్తారు. 4 లక్షల ఎకరాల పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. ఏప్రిల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 14న కొత్త సచివాలయం పక్కనే నిర్మిస్తున్న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరపాలని, ప్రభుత్వస్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని, తెలంగాణ యాత్రికుల కోసం కాశీలో, శబరిమలలో వసతిగృహాలను నిర్మించాలని నిర్ణయించింది.