Somu Veerraju: ఉద్యోగులపై ప్రభుత్వం దొంగ దెబ్బ: సోము వీర్రాజు

ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బ తీస్తోందని, ఉద్యమాలను అణిచి వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులు రాజకీయ పార్టీ మాదిరిగా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపాడు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను దొంగ దెబ్బ తీయాలని చూస్తుంది. లా సన్స్ బే కాలనీ లో గల బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ కామెంట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తుందన్నారు. ఉద్యోగుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చిందని అన్నారు. ప్రజల కోసం పని చేసే ఉద్యోగులు డిమాండ్ల విషయంలో ప్రభుత్వానికి లొంగి పోవద్దు అని సూచించారు. ఉద్యోగుల సర్వీస్ ప్రభుత్వానికే గాని వైసీపీకి కాదని అన్నారు. ఉపాధ్యాయులు బదిలీల కోసం కోర్టుని ఆశ్రయించారని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులంతా.. డీఏ మాట దేవుడెరుగు, జీతాలు వస్తే చాలు అన్నట్టుగా ఉన్నారని అన్నారు. సలహాదారులు మాత్రం సకాలంలో జీతాలు పొందుతున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏమిటి అన్న దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు నుంచి బీజేపీ శ్రేణులు విజయం దిశగా పని చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లో ప్రచారం చేస్తామని అన్నారు. దేవాదాయశాఖను వైసీపీ ప్రభుత్వం దేవాదాయ శాఖగా మార్చేసిందని ఎద్దేవా చేశారు. అన్నవరం, సింహాచలం, శ్రీ శైలం దేవస్థానాలకు నిధులు కేంద్రం ఇస్తుందని గుర్తు చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను అరెస్ట్ చేయడం లేదు అని దుయ్యబట్టారు.

నిన్నటికి నిన్న సీఎం జగన్ కు లేఖ రాసిన సోము వీర్రాజు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంతవరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.