ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ తనకు ఈడీ నోటీసులు పంపడంపై ఆమె మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ తనకు ఈడీ నోటీసులు పంపడంపై ఆమె మాట్లాడారు. ‘సంకీర్ణ సర్కార్ ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ను సోనియా గాంధీ తీసుకువచ్చారు.. ఆమె ధైర్యానికి నా సెల్యూట్. అయితే సోనియా చొరవతో మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో పాసైనా ఆ తర్వాత ముందుకు కదల్లేదు. 2014లో, 2019 ఎన్నికల ప్రచారంంలో కూడా బీజేపీ ఎన్నికల హామీల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ చేస్తామని చెప్పారు. కానీ రెండు సార్లు మంచి మెజారిటీతో గెలిచినా సరే బిల్లు తీసుకురాలేదు. యూపీఏ హయాంలో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి బిల్లు పాస్ కాలేదు. కానీ ఈ ప్రభుత్వానికి సొంతంగానే పూర్తి బలం ఉంది. ఆధార్ వంటి కొన్ని బిల్లులను పాస్ చేయడానికి మనీ బిల్ అని చెప్పి పాస్ చేశారు. ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నంత కూడా మన దేశంలో రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. అందుకే మేము ఈ బిల్లు కోసం పోరాటం మొదలుపెట్టాం. రేపు (మార్చి 10) ఉదయం గం. 10.00కి ఏచూరి, ప్రియాంక చతుర్వేది సమక్షంలో ఈ దీక్ష చేపడతాం. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూడా పాల్గొంటాయి’ అని కవిత తెలిపారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ తనకు పంపించిన నోటీసులపై స్పందించిన కవిత.. ‘ఈడీ నాకు నోటీస్ ఇచ్చి ఈరోజే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేను 16న వస్తాను అని చెప్పాను. కానీ ఈడీ ఒప్పుకోలేదు. నిజానికి మహిళల విచారణ వారికి అనుకూలంగా ఉన్నచోట చేయాలని కోర్టు తీర్పులు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. కానీ ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీస్ పంపింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. అందుకే మోడీ వచ్చే ముందు ఈడీని పంపారు. 9 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. తెలంగాణలో ఆ ప్రయత్నం చేశారు. కానీ మేము సఫలం కానీయలేదు. అందుకే ఇలా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈడీ డైరెక్టర్, సెబీ డైరెక్టర్ లను పదవీకాలం అయ్యాక కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వారంతా మోడీ చెప్పినట్టు వింటున్నారు. పొడిగించాలని అనుకుంటే అగ్నివీర్ జవాన్లను పొడిగించండి. నాలుగేళ్లు శిక్షణ ఇచ్చి వదిలేస్తారా? దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఒక ఇంజిన్ ప్రధాని, ఇంకో ఇంజిన్ అదానీ. నేను ఈడీ విచారణ ఎదుర్కొంటాను. అందుకు సిద్ధంగా ఉన్నాను. మరి మీ బీఎల్ సంతోష్ విచారణ ఎందుకు ఎదుర్కోవడం లేదు?
ధర్మం ఎటు ఉంటే విజయం అటు ఉంటుంది. జైల్లో ఉన్నంత మాత్రాన శ్రీకృష్ణుడి బలం తగ్గలేదు. వనవాసం చేసినంత మాత్రాన రాముడి ప్రభ తగ్గలేదు’ అని కవిత పేర్కొన్నారు.