CM Oath Ceremony: ఆ రెండు రాష్ట్రాల్లో కొలువుదీరిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు.. ప్రమాణస్వీకారోత్సవానికి కదిలిన కమల దళం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు. సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు..

మేఘాలయా సీఎంగా వరుసగా రెండోసారి కాన్రాడ్‌ సంగ్మా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఫాగు చౌహన్‌.. సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు. సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఎన్‌పీపీ పార్టీకి చెందిన ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, హెచ్‌ఎస్‌పీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు నాగాలాండ్‌ సీఎంగా నెఫ్యూ రియో ఐదోసారి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ , అమిత్‌షా హాజరయ్యారు. అటు మేఘాలయా , ఇటు నాగాలాండ్‌లో కూడా ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మేఘాలయాలో విడివిడిగా పోటీ చేసిన బీజేపీ , ఎన్‌పీపీ తరువాత ఎన్నికల తరువాత పొత్తు పెట్టుకున్నాయి.

ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం

కూటమిలో చేరిన బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యంతుంగో పాటన్ ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి లెజిస్లేచర్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లి, పరిశీలకుడు రంజిత్ దాస్ సమక్షంలో యంతుంగో పాటన్‌ను నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మేఘాలయ తరహాలోనే ఇక్కడ కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయ్యారు. యంతుంగో పాటన్‌తో పాటు, టిఆర్ జెలియాంగ్ కూడా రాష్ట్ర డిప్యూటీ సిఎంగా ప్రమాణం చేశారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టెమ్‌జెన్ ఇమ్నా అలంగ్, జి కైటో అయ్, జాకబ్ జిమోమి, కెజి కెనీ, పి పైవాంగ్, మెస్టుబో జమీర్, సిఎల్ జాన్, ఎస్ క్రూస్ మరియు పిబి చాంగ్‌లు మంత్రులుగా గవర్నర్ చేత ప్రమాణం చేయించారు.

ఎన్‌డిపిపికి చెందిన ఎమ్మెల్యే నాగాలాండ్ నుండి మంత్రి పదవి పొందిన మొదటి మహిళా శాసనసభ్యురాలు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రధాని మోదీ సల్హౌతుయోనువో క్రూస్‌ను ముకుళిత హస్తాలతో అభినందించారు. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూస్ పశ్చిమ అంగామి స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిని ఏడు ఓట్ల తేడాతో ఓడించారు. దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి ఎన్‌డిపిపి అభ్యర్థి హెకానీ జఖ్లూ విజయం సాధించారు.