రోజురోజుకు ప్రభుత్వంపై స్వరం పెంచుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే ఈనెల 9న భారీ ఉద్యమ కార్యచరణ ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. దీంతో మంగళవారం సీఎస్ తో జరిగే చర్చలు ఫలిస్తాయా? ఆందోళనకు బ్రేక్ పడుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ఉద్యమానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి. అలాగే రాష్ట్ర సీఎస్ ను కలిసి.. తమ డిమాండ్లను ముందుంచారు.. ఎట్టిపరిస్థితుల్లో ఉద్యమం నుంచి వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పేశారు ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. ఇదే క్రమంలో అమరావతిలో ఏపీ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశమైంది. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ను కలవడంతో.. ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.
కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ను.. నిర్వీర్యం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి.. శాఖ పునర్వ్యవస్థీకరణ చేయాలని కోరారు. అకతవకలపై లోకాయుక్తతో విచారణ జరపాలని తీర్మానం చేసినట్లు చెప్పారు సూర్యనారాయణ. ఉద్యోగ సంఘాల ఉద్యమానికి తోటి ఎంప్లాయిస్ యూనియన్ గా మద్దతు ఉంటుందని చెప్పారు సూర్యనారాయణ.
ఈనెల 3వ తారీఖున ఎంప్లాయిస్ తో మంత్రులు జరిపిన చర్చల అనంతరం ప్రభుత్వం చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు. ఉద్యమ కార్యాచరణ నుంచి వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈనెల 9నుంచి యథాతథంగా పోరాటంలోకి వెళ్తామని తేల్చిచెప్పారు. అయితే, మంగళవారం సీఎస్తో మీటింగ్ తర్వాత ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే అవకాశం ఉందని చెప్పారు మరో ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాస్.