మూడు రాజధానులపై మరోసారి స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ప్రముఖ వ్యాపారవేత్తలు, వేలాది మంది అతిధుల మధ్య ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నగరంగా విశాఖ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే మరోసారి సాగరతీరం సాక్షిగా అన్నారు…
మూడు రాజధానులపై మరోసారి స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ప్రముఖ వ్యాపారవేత్తలు, వేలాది మంది అతిధుల మధ్య ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నగరంగా విశాఖ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే మరోసారి సాగరతీరం సాక్షిగా అన్నారు. జనవరి 31న ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశం జరిగింది. అక్కడే విశాఖపై కీలక ప్రకటన చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. రానున్న రోజుల్లో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని.. త్వరలోనే తాను కూడా షిఫ్ట్ అవుతానంటూ సీఎం జగన్ అన్న విషయం తెలిసిందే.
దీంతో సీఎం ప్రకటన చేసిన వెంటనే అధికారులు కూడా అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టారు. కాపులుప్పాడ ఐటీ పార్కులో భవనాలు కూడా సిద్దం చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని.. కొత్త విద్యాసంవత్సరం నాటికి విశాఖ పరిపాలనా రాజధానిగా కార్యకలపాలు మొదలవుతాయని మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ కూడా ప్రకటించారు.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. మార్చి 28న ఇది విచారణకు రావాల్సి ఉంది. అయితే ముందుగానే విచారణకు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం మరోసారి కోర్టు తలుపులు తట్టింది. హైకోర్టు తీర్పుపై స్టే వస్తే కొత్త చట్టం ద్వారా మూడు రాజధానులపై ముందుకు వెళ్లొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.