Global Investor Summit :నేటి నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్

Global Investor Summit ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఉదయం సమ్మిట్ ప్రారంభం కానుంది.
Global Investor Summit సాగర తీర నగరం విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు రెండ్రోజుల పాటు సదస్సును నిర్వహించనున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు దాదాపు 8-10 వేల మంది వరకు పెట్టుబడిదారుల సదస్సుకు హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

విశాఖలో జరిగే సదస్సు తొలిరోజు కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత జి.మల్లికార్జునరావు తదితర పారిశ్రామిక దిగ్గజాలు సదస్సులో పాల్గొంటున్నారు.

‘అడ్వాంటేజ్‌ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నసదస్సుకు ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌, ఆయన సతీమణి భారతి గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సదస్సులో మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరుగుతాయని మంత్రులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే, తక్కువ సమయంలోనే పెట్టుబడుల ప్రతిపాదనల్ని కార్యరూపంలోకి తెచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఏపీ సర్కారు చెబుతోంది.

తొలి రోజు సదస్సు నిర్వహణ ఇలా….

శుక్రవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 118 స్టాల్స్‌తో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు.

భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.50 వరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన వనరులు- గ్రీన్‌ హైడ్రోజన్‌, వాహనరంగం- విద్యుత్‌ వాహనాలు, అంకుర సంస్థలు-నవకల్పనలు, ఆరోగ్య రంగం- వైద్యపరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, వ్యవసాయం-ఆహారశుద్ధి, ఏరోస్పేస్‌-రక్షణ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు.

పెట్టుబడి దారుల సదస్సులో పలువురు పారిశ్రామిక ప్రముఖులతో సీఎం జగన్‌, రాష్ట్ర మంత్రులు సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. తొలిరోజు సదస్సు ముగిసిన తర్వాత సాగర తీరంలోని ఎంజీఎం పార్కులో పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులకు ముఖ్యమంత్రి విందు ఇస్తారు.

రెండో రోజు ఒప్పందాలు…

రెండో రోజు సదస్సులో ఉదయం 9.30 నుంచి 10.30 వరకు ఏపీలో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరుగుతాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌, ఉన్నతవిద్య, పర్యాటక, ఆతిథ్య రంగాలు, నైపుణ్యాభివృద్ధి, జౌళి, దుస్తులు, ఔషధాలు, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగుస్తుంది.

పెట్టుబడిదారుల సదస్సుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఐదు భారీ హాళ్లలో సమావేశాలను నిర్వహిస్తోంది. . మూడో నెంబరు హ్యాంగర్‌లో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండువేల మందికిపైగా కూర్చునేలా అందులో ఏర్పాట్లు చేశారు. మొదటి హాలును పూర్తిగా అతిథుల భోజనాలకు కేటాయించారు. ఒకేసారి 700 మంది భోజనం చేసేలా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. రెండో హ్యాంగర్‌లో ఎగ్జిబిషన్‌, స్టాల్స్‌ ఏర్పాటుచేశారు. నాలుగో హ్యాంగర్‌ సీఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులకు ప్రత్యేక లాంజ్‌లు, ముఖ్యమంత్రితో పారిశ్రామిక ప్రముఖుల భేటీకి సమావేశ మందిరం, మీడియా హాల్‌ ఏర్పాటు చేశారు. ఐదో హ్యాంగర్‌లో సెమినార్లు నిర్వహిస్తారు.

అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు..

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సదస్సుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు విమానాశ్రయంలో స్వాగతం పలికి, సదస్సు ప్రాంగణానికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఐదుగురు జిల్లా స్థాయి అధికారులను సమన్వయకర్తలుగా నియమించింది. పారిశ్రామికవేత్తల్లో కొందరు ప్రత్యేక విమానాల్లో వస్తుండటంతో వారి కోసం ప్రత్యేకంగా ఖరీదైన కార్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ప్రముఖుల బసకు 17 ప్రముఖ హోటళ్లలోని 550 గదులు సిద్ధం చేశారు. విశాఖ సదస్సుకు 26 దేశాల నుంచి అతిథులు, పారిశ్రామికవేత్తలు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఫ్రాన్స్‌, తైవాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, యూఏఈ, జపాన్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, సింగపూర్‌, జింబాబ్వే తదితర దేశాల ప్రతినిధులు వస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.