డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది.
రాబడిని పరిగణనలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో, ఉద్యోగుల డీఏ అలవెన్స్‌పై ఆమోద ముద్ర పడవచ్చు. దానితో పాటు పెరిగిన డీఏను కూడా ప్రకటించవచ్చు. అందువల్ల మార్చి నెల జీతంలో క్రమంగా పెరుగుదల ఉంటుంది. కేంద్ర ఉద్యోగుల జీతం రూ.27312 మేర పెరిగే అవకాశం ఉందని వర్గాల సమాచారం. మార్చి 1న మంత్రివర్గం సమావేశం కానుంది. డీఏకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డియర్‌నెస్ అలవెన్స్‌లో భారీగా పెంపుదల ఉంటుంది. ఉద్యోగి ఖాతాలో పెద్ద మొత్తం జమ అవుతుంది. అలాగే ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు అందుతాయి. డీఏను 4 శాతం పెంచడం వల్ల ఉద్యోగుల జీతం నెలకు రూ.720 నుంచి రూ.2276కి భారీ ప్రయోజనం చేకూరుతుంది.