175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే దమ్ముందా?

CM Jagan Challenge : ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాల్లో మరింత హీట్ పెంచారు. సై అంటే సై అంటూ చాలెంజ్ లు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్ డైరెక్ట్ గా అటాక్ కు దిగారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు దమ్ముందా? అంటూ సవాల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ఏపీ సీఎం జగన్ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే దమ్ముందా? అని చంద్రబాబు, పవన్ లకు సవాల్ చేశారు సీఎం జగన్. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం మీ బిడ్డకు ఉందన్న సీఎం జగన్.. ప్రతిపక్షాలు మాత్రం ఆ ధైర్యం లేదన్నారు. రైతులను వంచించిన చంద్రబాబుకు, రైతులకు అండగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్.

”మీ బిడ్డకున్న ధైర్యం వాళ్లకి ఎవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా. చంద్రబాబుకి కానీ, ఆయన దత్త పుత్రుడికి కానీ.. సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా? అని సవాల్ విసురుతున్నా. నాలుగేళ్లుగా దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. గతంలో మాదిరిగా రెయిన్ గన్నులు లేవు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రెయిన్ మాత్రమే ఉంది.

ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నా. 2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ కాలంలో ప్రతి ఏటా కరవుకు కేరాఫ్ అడ్రస్. 1995 నుంచి 2004 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. మళ్లీ ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు అప్పుడూ ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి.

గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.8వేల 845 కోట్లు. ఆయన ఈ బకాయిలు పెట్టి పోతే మీ బిడ్డ రైతన్నల కోసం చిరునవ్వులతో ఆ బకాయిలు తీర్చాడు అని సగర్వంగా చెప్పుకుంటున్నా. నిబద్దతతో చేశాము కాబట్టే ఏమీ చేయని చంద్రబాబుకు, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు, రైతుకి ఇచ్చిన ప్రతి మాట తప్పిన చంద్రబాబుకు ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి ప్రజలు బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతాంది. రైతులను వంచించిన చంద్రబాబు, రైతన్నకు అండగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది” అంటూ ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి జగన్.

”కరవు అండగా ఉన్న చంద్రబాబుకు.. వరుణుడు కరుణించిన మన ప్రభుత్వానికి యుద్ధం. ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబుకు, ఇంగ్లీష్ మీడియం తెచ్చిన మన ప్రభుత్వానికి మధ్య యుద్ధం. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లు చంద్రబాబు పాలన ఉండేది. మంచి మనసుతో పని చేస్తుంటే దేవుడు కరుణిస్తున్నాడు. వర్షాలు పడుతున్నాయి. 2022 డిసెంబర్ లో మాండూస్ తుపాను ప్రభావంతో నష్టపోయిన 91వేల 237 మంది రైతుల ఖాతాల్లో రూ.76.99 కోట్లు జమ చేశాం. ఇప్పటికే రైతు భరోసా రెండు విడతల్లో రూ.11,500 జమ. వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్ పథకం కింద 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.1090 కోట్లు జమ చేశాం” అని సీఎం జగన్ చెప్పారు.