దేశానికి స్వాతంత్రం వచ్చినా ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. అవి క్యాన్సర్ గడ్డల్లా మారి దేశమంతా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. కానీ ప్రధాని మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు. రాజకీయాల కోసం.. ఓట్ల కోసం.. కాంగ్రెస్ పేర బెట్టిన సమస్యలన్నింటినీ పరిష్కరించారు. ఆ సమస్యలు పరిష్కారం కావడంతో దేశంలో అభివృద్ధికి సంబంధం లేని..ప్రజల్ని విభజించు , పాలించు అనే స్ట్రాటజీ కాంగ్రెస్ కు లేకుండా పోయింది.
అయోధ్య సమస్య పరిష్కారం – రామ మందిర నిర్మాణం
శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామజన్మభూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. ధృడమైన ఆత్మవిశ్వాసం, పటిష్టమైన వ్యూహరచన, తగిన సన్నద్ధత, వ్యూహాలను అమలు చేసే చాణక్యం ఉంటే ఎంతటి విషమ పరిస్థితులనైనా అవలీలగా అధిగమించవచ్చని మోడీ ప్రభుత్వం రుజువు చేసింది. ఈ సమస్య ఆధారంగా దేశం మొత్తం ఎంత రాజకీయ కల్లోలంరేగిందో చెప్పాల్సిన పని లేదు. ఈ సమస్యకు అసలు పరిష్కారం వస్తుందా అని చాలా మంది అనుకున్నారు. కానీ మోదీ చేసి చూపించారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు
కశ్మీర్ దేశంలో భాగమా కాదా అని అనుమానాలు రేకెత్తించే ఆర్టికల్ ను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ కు 70 ఏండ్లలో సాధ్యం కానిది, 70 రోజుల్లో సాధ్యం చేసి చూపించింది మోడీ ప్రభుత్వం. కాశ్మీర్‌ను మనదేశం నుంచి వేరుపరించేందుకు జరిగిన కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే ఈ నిర్ణయం.. జాతీయ సమగ్రతను బలపరిచి, అఖండ భారత్ గా నిలిచేలా చేసింది. ఈ నిర్ణయంపై ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేనంత పలుకుబడిని అప్పటికే ప్రపంచం మొత్తం దేశం సాధించింది.
సైనిక దళాల సంస్కరణ
ఒకే దేశం ఒకే ముఖ్య దళాధిపతి మార్పు దిశగా మరిన్ని అడుగులేసి తీరతామంటూ గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోడీ రక్షణ రంగానికి సంబంధించిన త్రివిధ దళాల అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను నియమించారు. దేశ రక్షణ దళాలను ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా నిలిపే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే కీలకమైన సంస్కరణ అని అనుకోవచ్చు..
పౌరసత్వ సవరణ చట్టంతో మరింత ముందడుగు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శిలు, క్రైస్తవులు మన దేశానికి శరణార్థులుగా వస్తే వారికి మన పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. పౌరసత్వ సవరణ చట్టంపై భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చొరబాట్లను నియంత్రించి, దేశ ప్రజలకు భద్రతను కల్పించేందుకే కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. దేశ భద్రతను పణంగా పెట్టి చేసే రాజకీయాలకు .. బీజేపీ చెక్ పెట్టినట్లయింది.
ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) బిల్లు
ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) బిల్లు తీసుకువచ్చి ఈ చట్టం ద్వారా విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దేశంలో కులాలకు పేదరికంతో సంబంధం లేదు. అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారు. వారికి కులం కారణంగా అవకాశాలు రావడం గగనమైపోయింది. అలాంటి వారికి ఊతమిచ్చేందుకు మోదీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చి అతి పెద్ద సమస్యలకు సులువైన పరిష్కారం చూపారు.
నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ప్రణాళికా సంఘం వంటి జడత్వం నిండిన యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశా నిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతీ ఆయోగ్ వంటి సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఆర్థిక రంగంలో నిశ్శబ్ద విప్లవం సాధించిన అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడి, 5 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.