కొందరి నోట్లో నూగింజ నానదు..మరికొందరు పొరపాటున కూడా పెదవి విప్పరు. రెండూ సరికాదంటారు పండితులు. ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. చెప్పాల్సినవి చెప్పేసినా పర్వాలేదు కానీ చెప్పకూడనివేంటో ఇక్కడ తెలుసుకోండి.
నోరు విప్పితే చాలు గలగలా మాట్లాడేస్తుంటారు కొందరు…అడిగినా అడగకపోయినా అవసరం అయినవి లేనివి చెప్పేస్తుంటారు ఇంకొందరు.. జీవితంలో ఎంత పెద్ద విషయం జరిగినా కానీ పొరపాటున కూడా పెదవివిప్పరు ఇంకొందరు. అయితే చెప్పుకునే విషయాలూ ఉంటాయి, చెప్పుకోకూడనివీ ఉంటాయి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏ విషయంలోనూ అతి పనికిరాదు. చెప్పాల్సినవి చెప్పాలి, దాచాల్సినవి దాచుకోవాలి. ఏవి చెప్పాలో ఏ విషయాలు బయటపెట్టకూడదో గ్రహించుకోవడమే విజ్ఞత. అయితే ముఖ్యంగా బయటకు ఎప్పటికీ చెప్పకూడదని 9 విషయాలగురించి ప్రస్తావించారు పండితులు. అవేంటో చూద్దాం..
ఆయుష్షు
మీ ఆయుష్షు ఎంతన్నది ఎప్పుడూ బయటపెట్టకూడదంటారు పండితులు. జాతకాలను విశ్వసించేవారు వాటి ద్వారా తమ ఆయుష్షుని కూడా ఇంచుమించు తెలుసుకోగలుగుతారు. ఈ విషయంపై తెలిసినప్పటికీ బయటపెట్టకూడదంటారు పండితులు. ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా నిబ్బరంగా ఉండి దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై బాధిస్తుంది.
ధనం
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది ఈ రోజుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. సంపద విషయం కేవలం భార్య-భర్త మధ్య మాత్రమే ఉండాలి. పొగడ్తల కోసం బయటకు వెల్లడించడం అత్యంత ప్రమాదకరం.
ఇంట్లోని గొడవలు
సమస్యలు లేని ఇల్లుండదు. కానీ ఆసమస్యను బయటపెట్టకూడదు. దానికే ఇంటిగుట్టు అంటారు. ఎన్ని సమస్యలున్నా కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం కల్పించుకుని పరిష్కరించుకోవాలి కానీ మూడోవ్యక్తికి కుటుంబంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకూడదు. అందుకే మన పెద్దలు అనేవారు . ఇంట్లో గొడవ ఉంటె ఇల్లెక్కి అరవొద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పోడుచుకొవద్దు అని.
మంత్రం
”మననం చేసేది మంత్రం”- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన.
ఔషధం
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటే వారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిది
శృంగారం
భార్య భర్త మధ్య జరిగిన కలయిక గురించి కన్న తల్లి తప్ప మరో ఏ ఇతర వ్యక్తులతో చెప్పకూడదు. మరో జీవి పుట్టుకకు కారణం అయిన పవిత్రమైన కార్యం గురించి బహిరంగంగా మాట్లాడడం మంచిదికాదంటారు.
దానం
దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు.
మానం
శరీరాన్ని బహిర్గతం చేయకూడదు. ఒళ్ళును ఎప్పుడూ దాచుకోవాలి. భార్య భర్తలు తప్ప మరో వ్యక్తి శరీరం ఆసాంతం చూడడం దోషం, మహాపాపం అంటారు పండితులు
అవమానం
జరిగిన అవమానం మర్చిపోవాలి కానీ దానిని వేరేవారికి చెప్పడం వల్ల మీరు మరింత నష్టపోతాలు కానీ లాభం పొందలేరు. పదే పదే అవమానం తలుచుకోవడం వల్ల క్రోధం పెరుగుతుంది
ఈ తొమ్మిది రహస్యాలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అంటారు పెద్దలు
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.