76 ఇండిపెండెన్స్ డే : జీ 20 నాయకత్వంలో విశ్వగురువు భారత్

సభ్య దేశాల స్థాయి నుంచి నాయకత్వం స్థాయికి భారత్ ఎదిగింది. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రతిష్ఠాత్మక వేదిక గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీ (జీ-20). ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో జీ-20 ఏర్పాటయ్యింది. ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు అంతర్జాతీయ ఆర్థిక అంశాలను చర్చించే వేదికగా ఇది రూపుదిద్దుకుంది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇది దేశాధినేతల వేదికగా మారింది. తర్వాత 2009లో ‘అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రతిష్ఠాత్మక సంస్థ’గా మారింది. ప్రపంచ జీడీపీలో సుమారు 85 శాతం వాటా, ప్రపంచ జనాభాలో 60 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం పైగా వాటాను జీ-20 కలిగి ఉంది. అలాంటి జీ-20కి స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా 2022, డిసెంబర్‌ 1 నుంచి భారత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత పరపతికి, నాయకత్వ గుర్తింపునకు నిదర్శనం.

భారత్‌కు ప్రపంచ నాయకత్వం

ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌, కొవిడ్‌-19 సవాలును తట్టుకొని అభివృద్ధి బాటలో నడవగలుతుంది. అదే సమయంలో 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నెల రోజులు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి ఉండటం, శాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌, వాసనార్‌ అరేంజ్‌మెంట్‌ వంటి వాటికి కూడా 2023లో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండటం వల్ల అంతర్జాతీయంగా మన విదేశాంగ విధానానికి, మన సాంస్కృతిక వైభవానికి, మన నైపుణ్యాలకు గుర్తింపు లభించి, భవిష్యత్తులో ప్రపంచ నాయకత్వ దేశంగా నిలబడే అవకాశం ఏర్పడుతుంది. ప్రపంచంలో ఇప్పటికే చైనా తర్వాత అనేక రంగాల్లో ముందజంలో ఉన్న భారత్‌ చైనా దురాక్రమణపూరిత విధానం వల్ల ప్రపంచంలో అపఖ్యాతి మూటగట్టుకుంటూ ఉండగా, భారత్‌ అందుకు ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దక్షిణ దేశాలకు ప్రాతినిథ్యం వహించేలా తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటున్నది.

ప్రపంచ విధానాల దిశానిర్దేశం

జీ-20 సమావేశం వల్ల దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశాలు ఏర్పడుతాయి. దేశం అతిపెద్ద మానవ వనరుల డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌, సహజ వనరుల లభ్యత వంటి అంశాల ఆధారంగా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. మరోవైపు భారత్‌ నాయకత్వం వహిస్తున్న ‘అంతర్జాతీయ సౌరకూటమి’, ‘వన్‌ సన్‌ – వన్‌ వరల్డ్‌ – వన్‌ గ్రిడ్‌’ వంటి చొరవలు మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి భారత్‌ తయారీ కేంద్రంగా మారవచ్చు. జీ-20 అధ్యక్ష హోదాలో భారత్‌ తన అభివృద్ధి కార్యక్రమాల గురించి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో అంతర్జాతీయ కృషిని పొందడానికి అవకాశం ఉంది. వాతావరణ మార్పులను నిరోధించడానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బహుళపక్ష వేదికల సంస్కరణలు అమలు చేయడానికి భారత్‌కు అవకాశాలు లభిస్తాయి.

భారత నాయకత్వంపై ప్రపంచ దేశాలకు నమ్మకం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో జీ-20 సభ్యులు ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి, అభివృద్ధి వ్యయాన్ని పెంచడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం వంటి సంఘటిత చర్యలను చేపట్టింది. ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పు, డేటా వికేంద్రీకరణ మొదలైన కీలకమైన అంతర్జాతీయ విషయాల్లో జీ-20 అవసరమైన అంతర్జాతీయ సహకారానికి నాయకత్వం వహిస్తుంది. ప్రపంచంలో కొవిడ్‌-19 నుంచి పూర్తిగా కోలుకోకముందే రష్యా-ఉక్రెయిన్‌ రూపంలో మరొక సంక్షోభం ముందుకొచ్చింది. దీన్ని ఎదుర్కోవడంలో భారత్ పాత్ర కీలకం అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కీలక విషయాల మీద గ్లోబల్‌ ఎజెండాకు తన వంతు పాత్ర పోషించడానికి భారత్‌కు ఇదొక విశిష్ట అవకాశం. భారతదేశం ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలతోనూ తన వాణిజ్య వాతావరణ, సాంస్కృతిక సంబంధాలను సమతుల్యం చేయడానికి ఈ వేదిక ఒక మంచి అవకాశంగా మారుతుంది. ప్రధాని దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన భారత విదేశాంగ విధానం ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా నాయకత్వ పాత్రను పోషిస్తుంది.