76 ఏళ్ల స్వాతంత్రంలో . ఒక దేశం సొంతంగా క్రీడల్లో సాధించిన ప్రగతి గురించి చెప్పుకునేందుకుఎన్నో విజయాలు ఉన్నాయి. ప్రపంచ కప్ విజయాలు, ఒలింపిక్ పతకాలు, వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు, దేశంలో ఆటకు దిశానిర్దేశం చేసిన క్షణాలు, ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఘటనలు… స్వాతంత్య్రానంతరం భారత క్రీడా రంగం పురోగతిలో చెప్పుకోదగ్గ విజయాలు ఉన్నాయి. గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలు అనూహ్యం.
క్రికెట్లో ప్రపంచ రథసారధి
స్వాతంత్య్రానికి ముందు భారత క్రికెట్ జట్టు ఒక్క ఇంగ్లండ్‌తోనే నాలుగు టెస్టు సిరీస్‌లు ఆడి నాలుగూ ఓడింది. 1947 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో భారత్ కొత్త ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పలు గొప్ప విజయాలు, అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చినా… 1983 వరకు కూడా క్రికెట్‌పై అభిమానం దేశంలో కొద్ది మందికే పరిమితం. వన్డే క్రికెట్ వచ్చిన తర్వాత 1975, 1979లలో మన ఘోర ప్రదర్శన ఆటపై ఆసక్తిని మరింత తగ్గించింది. అయితే 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు వన్డేల్లో విశ్వవిజేతగా నిలవడంతో ఒక్కసారి అంతా మారిపోయింది. ఈ గెలుపు తర్వాత దేశ ప్రజల జీవితాల్లో క్రికెట్ ఒక భాగంగా మారిపోయింది. ఇంటింటా అభిమానులు, ప్రత్యక్ష ప్రసారాలు, భారీ ఎత్తున ఆదాయం, క్రికెటర్లను దేవుడిలా కొలవడం… ఇలా అన్నింటికీ ఈ విజయమే నాంది పలికింది. 28 ఏళ్ల తర్వాత 2011లో భారత్ మరోసారి ప్రపంచ కప్ గెలవడం అభిమానులను ఆనంద పర్చింది. అంతకుముందే 2007లో భారత్ మరో క్రికెట్ విప్లవానికి కారణమైంది. ఆ ఏడాది తొలి టి20 ప్రపంచ్‌కప్‌ను భారత్ గెలుచుకోవడం కూడా క్రికెట్లో కొత్త శకానికి తెర తీసింది. టి20 ఫార్మాట్ ఉజ్వలమైన భవిష్యత్తుకు, ఆటగాళ్ల కోసం బంగారు బాతులా పరిణమించేందుకు ఈ వరల్డ్ కప్ మేలి మలుపుగా చెప్పవచ్చు.
ఒలింపిక్స్ లో ప్రమాణాల మెరుగు !
భారత్‌కు స్వాతంత్య్రం లభించేనాటికి మన దేశం తరఫున ఒక్కరు కూడా వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు. అయితే ఐదేళ్ల తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో ఆ కల ఫలించింది. ఖాషాబా జాదవ్ కుస్తీ పోటీల్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మెక్సికో, కెనడా, జర్మనీలకు చెందిన స్టార్ రెజ్లర్లను ఓడించి అతను సాధించిన ఈ విజయం అసమానం. ఆ తర్వాత కరణం మల్లీశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్; వెయిట్‌లిఫ్టింగ్–కాంస్యం), రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004 ఏథెన్స్; షూటింగ్–రజతం), విజేందర్ సింగ్ (2008 బీజింగ్; బాక్సింగ్–కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; రెజ్లింగ్–కాంస్యం) కూడా ఒలింపిక్స్‌లో తమ సత్తాను ప్రదర్శించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఏకంగా ఆరు పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. రెజ్లర్ సుశీల్ కుమార్, షూటర్ విజయ్ కుమార్‌లు రజత పతకాలు గెలుపొందగా…యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్), మేరీ కోమ్ (బాక్సింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్) కాంస్య పతకాలు సాధించారు. భారత ఒలింపిక్ చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు (రజతం, కాంస్యం) సాధించిన ఏకైక క్రీడాకారుడిగా సుశీల్ కుమార్ నిలిచాడు. 2016 రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యంతో, షట్లర్ పీవీ సింధు రజతంతో తమ విలువను చూపించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఏడుకి చేరింది. మొత్తంగా ఏడు పతకాలతో భారత్ గత రికార్డ్‌ల్ని బ్రేక్ చేసింది.
మెరుగుపడుతున్న క్రీడా సౌకర్యాలు
స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్ల తర్వాత అన్ని రకాల క్రీడల్లోనే భారత జట్టు పరిస్థితి మెరుగ్గా ఉంది. వాటిలోనే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నా… ఇంకా మన ముద్ర చూపించని క్రీడలు కూడా చాలా ఉన్నాయి. ఆర్చరీ, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్‌లలో మన ఆట అంతంత మాత్రమే. మున్ముందు అయినా వీటిలో కూడా మన వైభవం పెరుగుతుందని ఆశిద్దాం. ఇందు కోసం కేంద్రం ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని చేపట్టి…అందర్నీ భాగస్వాముల్ని చేస్ోతంది. ప్రతిభను గుర్తించేందుకు ఏర్పాట్లు చేసింది.