దేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. గత పదేళ్లుగా జరుగుతున్న మార్పు.. దేశం సాధిస్తన్న అభివృద్ధి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. పా కిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లో ఆకలి మంటలు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాలు దొరకక అల్లాడుతున్న జనాలు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి ప్రపంచ దేశాలతో సహా భారతదేశంపై ఆధారపడ్డ శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి విధానాలతో సవాళ్లను అధిగమించి, అభివృద్ధి పథంలో సాగుతున్న దేశంగా భారతదేశం అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నది.
సవాళ్లను అధిగమించి ఊహించనంత జీడీపీ
నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) 31 మే 2023 రోజు విడుదల చేసిన లెక్కల ప్రకారం నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం 2021-– 22 ఆర్థిక సంవత్సరానికి 9.1% జీడీపీ వృద్ధిరేటుతో మరియు 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 7.2% జీడీపీ వృద్ధిరేటుతో ప్రపంచంలోనే మొదటి వరుసలో నిలబడింది. ప్రస్తుతం భారతదేశం ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది.
ప్రపంచవ్యాప్తంగా గుదిబండ లాగ తయారైన ఆర్థికపరమైన అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత భారతదేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకున్న చారిత్రాత్మక విధానపరమైన నిర్ణయాలైన దేశంలోని మొబైల్, ఆటోమొబైల్, ఫార్మా, సోలార్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, వస్త్ర పరిశ్రమ, ఏవియేషన్, కెమికల్స్, టెలికాం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇతరత్రా 14 ఉత్పత్తి రంగాల అభివృద్ధి కోసం దాదాపుగా 3 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకం సాధించిన విజయం ఇది.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టిన ఎన్డీఏ సర్కారు
ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశం యొక్క సాధారణ జీడీపీ 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 16.1% వృద్ధిరేటుతో 272.41 లక్షల కోట్లు (3.5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ) . ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నా, భారతదేశం యొక్క జీడీపీ వృద్ధిరేటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 6.5% నుంచి 7% గా ఉండబోతుందని అంతర్జాతీయ సర్వేలు వెల్లడించడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా భారతదేశం ప్రపంచంలో జీడీపీ వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉండబోతుంది అన్నది వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుంటే భారతదేశం 4.8 శాతానికి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం గొప్పదనం. లేకపోతే ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మూడు వేలకు కొనుక్కోవాల్సి వచ్చేది.
కరోనా తర్వాత ఇలా కోలుకున్నదేశం మనదే !
కరోనా కట్టడికి దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్, స్టార్టప్ ఇండియా స్కీం ద్వారా వందకు పైగా యూనికార్న్ కంపెనీలతో ప్రపంచంలో మూడవ స్థానం, పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, 100 లక్షల కోట్లతో గతి శక్తి ప్రణాళికతో దేశంలో మౌలిక సదుపాయాలైన రోడ్డు రవాణ, రైల్వే, వాయు మరియు ఇతర రంగాల సత్వర అభివృద్ది. మూలధన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఒక్క 2023 బడ్జెట్లో 10 లక్షల కోట్ల పైచిలుకు నిధుల కేటాయింపు. రక్షణ రంగంతో పాటుగా అన్ని రంగాలలో పెరుగుతున్న ఎగుమతులు, ఆత్మనిర్భర్ భారత్ అద్భుతమైన విజయాలతో భారతదేశ 2026-– 27 నాటికి 5 లక్షల కోట్ల జీడీపీతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి విశ్వగురువుగా అవతరించబోతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. 100 సంవత్సరాల స్వతంత్ర భారతావని వచ్చేనాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతోంది.
అంటే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లక్ష్యం దిశగా భారత్ పరుగులు పెడుతోంది..గత తొమ్మిదేళ్ల కాలంలోనే అని అర్థం చేసుకోవచ్చు.