50 శాతం ఓటే షేర్ లక్ష్యం – మోదీ

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వంద రోజులు కూడా లేని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్న వేళ ప్రధాని మోదీ బీజేపీ శ్రేణులకు ఇచ్చిన ఒక సందేశం వారిని ఉత్తేజ పరిచేదిగా ఉంది. ఎవరు ఎలా పనిచేయాలి, ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టాలి లాంటి అంశాలపై మోదీ వివరంగా మాట్లాడారు. వారికి ఆయన గెలుపు మంత్రోపదేశం చేశారనే చెప్పాలి….

గత ఎన్నికల్లో 37 శాతం ఓట్ షేర్

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. మొదటి రోజున ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటే నిర్ణయాత్మక విజయం ఖాయమని మోదీ విశ్లేషించారు. గత ఎన్నికల్లో 37.36 శాతం ఓట్లు వచ్చిన సంగతిని ఆయన నర్మగర్భంగా గుర్తుచేశారు. ఆ క్రమంలో పార్టీకి 303 స్థానాలు దక్కాయి. ఈ సారి అంతకంటే చాలా ఎక్కువ చోట్ల గెలిచేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దక్షిణాదిలో కొన్ని చోట్ల గెలవగలిగితే తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని బీజేపీ ఎదురు చూస్తోంది.

పాజిటివ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మోదీ..

కార్యవర్గ సమావేశంలో మోదీ దాదాపు నాలుగు గంటల గడిపారు. గంటన్నర పాటు సందేశాత్మక ప్రసంగం చేశారు. నాలుగు ప్రధానాంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. మహిళలు, రైతులు, యువత, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో పేదరికమే పెద్ద కులంగా మారిందని ఆయన ఆవేదన చెందుతూ ప్రతీ పేదవాడికి గౌరవప్రదమైన జీవితాన్నిచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. దేశంలో పాజిటివ్ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆ దిశగానే ప్రజల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. విపక్షాల నెగిటివ్ ప్రచార ట్రాప్ లో పడిపోవద్దని పార్టీ నేతలకు సూచిస్తూ దాని వల్ల బీజేపీకి మాత్రమే కాకుండా దేశానికి కూడా నష్టమేనన్నారు..

సోషల్ మీడియాను సంపూర్ణంగా వినియోగించాలి…

దేశంలో యువత సోషల్ మీడియా పట్ల త్వరగా ఆకర్షితులవుతున్నారని గుర్తు చేసిన మోదీ… పార్టీ ప్రచారం కూడా అక్కడ తీవ్రస్థాయిలో ఉండాలన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా సులభతరంగా పార్టీ ప్రచారం చేసే వీలుందని మోదీ గుర్తుచేశారు. ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సరికొత్త కార్యక్రమాలను రూపొందించి ప్రచారానికి వినియోగిస్తే దానితో పార్టీ విధానాలు ప్రతీ ఒక్కరికీ చేరతాయని, తమ నిర్దేశిత 50 శాతం ఓట్ల లక్ష్యం నెరవేరుతుందని మోదీ ప్రస్తావించారు.