హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు పాటించాల్సిన 5 జాగ్రత్తలు!

అప్పట్లో వయసు పైబడిన తర్వాత గుండె సంబంధిత వ్యాధులొచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఐదు జాగ్తత్తలు పాటిస్తే చాలంటున్నారు వైద్యులు…

గుండెపోటు, కార్డియాక్ అరెస్టు, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్డరీ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఇవన్నీ గుండె సంబంధ వ్యాధుల జాబితా. ఇవి ఎప్పుడైనా ఎవ్వరిపైనా అటాక్ చేయొచ్చు..మాకు రావనే ధీమా పనికిరాదు. అయితే వీటిని అడ్డుకునే మార్గాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయంటున్నారు వైద్యులు.

డైటింగ్‌లు చేయొద్దు
కీటో డైట్, లిక్విడ్ డైట్, డ్రై ఫాస్టింగ్, ఫాస్టింగ్ ఇలా రకరకరాల డైట్లు ఫాలో అవుతున్నారంతా. ఇదో ట్రెండ్ అయిపోయింది. కానీ డైటింగ్ అనే మాటే వద్దంటున్నారు వైద్యులు. ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ కు దూరంగా ఉంటూ టైమ్ కి తింటే చాలు ఎలాంటి అనారోగ్యం రాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా తినే ఫుడ్ ని కడుపునండా కాకుండా ఓ ముద్ద తగ్గించి తింటే చాలు. ఎందుకంటే తక్కువ కేలరీలు, సమతులాహారం అందకపోవడం వల్ల కూడా గుండె వీక్ గా ఉంటుంది. అందుకే డైట్ పేరుతో అనారోగ్యం తెచ్చుకోకండి హాయిగా తినండి.

ధూమపానం మానేయాలి
ఫిట్ నెస్ ఎంత మెంటైన్ చేసినా పొగతాగే అలవాటున్నా గుండెపోటు నుంచి తప్పించుకోలేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాం, ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవుతున్నాం అనుకుంటే కాదు. సిగరెట్లు కాల్చే అలవాటు ఉన్నా గుండెకు ప్రమాదమే. పొగాకు ధమనులను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల రక్తప్రసరణ సరిగా అందక గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది

తగినంత వ్యాయామం
శారీరక శ్రమకు ఎంత దూరంగా ఉంటే గుండె జబ్బులకు అంతగా దగ్గరవుతున్నట్టు లెక్క. జిమ్ లో గంటల కొద్దీ చెమటలు చిందించక్కర్లేదు. రోజూ ఓ అరగంట నడక, ఓ అరగంట సింపుల్ వర్కవుట్లు చేసినా చాలు. గంటలకొద్దీ ఒకే దగ్గర కూర్చోకుండా మధ్యలో అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

సమతులాహారం
తృణధాన్యాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కాల్షియం, ఖనిజాలు, విటమిన్లు కలిగిన ఆహారాలను మెనూలో ఉండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యానికి సమతులాహారం చాలా ముఖ్యం. నట్స్, దేశీ నెయ్యి, తాజా పండ్లు, కూరగాయలు రోజూ తినాలి. వాటి ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరాన్ని చేరుతాయి.

రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి
రక్తం అధిక శక్తితో ధమని గోడలను గుద్దుతూ ప్రవహించినప్పుడు దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది చాలా నిశ్శబ్ధంగా దాడి చేస్తుంది. దీర్ఘకాలంలో గుండెజబ్బులకు కారణమవుతుంది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సోడియాన్ని తక్కువ తీసుకోవాలి. ధూమపానం, ఆల్కాహాల్ వంటివి మానేయాలి. వ్యాయామాలు చేయాలి. ఇవన్నీ రక్తపోటు నియంత్రిస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం