మొత్తం 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువ అంటారు. ఆ ఐదు అలంకారాలు ఏంటి? వాటిని అనుసరించడం వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం
5 అలంకారాలు
- కాళ్ళకి మెట్టెలు,పట్టీలు
- చేతులకి గాజులు
- మెడలో మంగళసూత్రం
- నుదుటిపై కుంకుమ
- తలలో పూలు
కాళ్ళకు పట్టీలు మెట్టెలు
ఆడపిల్ల ఇంట్లో పట్టీలు పెట్టుకుని తిరుగుతుంటే ఘల్లుఘల్లుమని లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుంది అంటారు పెద్దలు. ఏ ఇంట్లో స్త్రీ కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు తిష్టవేసుకుని కూర్చుంటుందని చెబుతారు పండితులు. అందుకే ముఖ్యంగా పెళ్లైన స్త్రీ కాళ్లు బోడిగా ఉండకూడదు కాళ్లకు పట్టీలు, మెట్టెలు ఉండాలని చెబుతారు. దీనివెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే…కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ ఆగుతుంది. ఈనాడి నేరుగా గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయం పనితీరు బావుంటుంది.
కుంకుమ
ఇప్పుడంటే మార్కెట్లో రకరకాల కుంకుమలు వచ్చాయి కానీ అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం కోసమే కుంకుమ పెట్టుకుంటారు.
మంగళసూత్రం
మంగళసూత్రం ఇప్పుడు వేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే. ఫ్యాషన్ పేరుతో సూత్రాలు తీసి పక్కనపడేసి చిన్న చిన్న నల్లపూసల గొలుసు వేసుకుంటున్నారు ఇంకొందరైతే మెడను బోడిగానే ఉంచుతున్నారు. కానీ మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలంటే మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందట. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటివల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయంటారు. క్యాన్సర్ కి బంగారం ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది కూడా.
గాజులు
ముత్తైదువ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేకానీ జిల్ జిగేల్ మనే ప్లాస్టిక్ గాజుల కానేకాదు. చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని కలిగిఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండడం వల్ల శరీరంలో రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువకావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు. లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి.
తలలో పూలు
పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె, ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా రాగుతోందని విశ్విసించేవారు. వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జిని ఇంట్లో నింపుతుంది.
ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుడక, చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే..ఇదేం చాదస్తం కాదు, పాతతరం ముతక ఆలోచనా కాదు…ట్రెండ్ పేరుతో ఆరోగ్యాన్నిచ్చే వీటిని పక్కనపడేయడమే కాకుండా పాతచింతకాయ ఆలోచనలు, చాదస్తం అంటూ వీటిని పాలో అయ్యేవాళ్లని ఎద్దేవా చేస్తున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.