గురువిందకు కిందున్న నలుపు తెలియదన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉంటుంది. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేస్తూ కాలం గడిపే కాంగ్రెస్ పార్టీ తాను గుట్టు చప్పుడు కాకుండా సొమ్ములు బొక్కెయ్యాలని చూస్తుంటుంది. ఐనా అబద్ధాలు, అవినీతి, అక్రమాలు ఏదోక రోజున బయటపడతాయి కదా. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం బయటపడుతోంది. పైగా ఇప్పుడు రాజకీయ నాయకులకు కొందరు అవినీతి అధికారుల అపవిత్ర కలయిక తోడయ్యింది…
అధికారులు అడుగుతున్నారన్న కాంట్రాక్టర్లు
కర్ణాటక ఇప్పుడు అవినీతి రాజ్యంగా మారిపోయింది. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచే కలెక్షన్ ప్రారంభించింది. ఈ మాట స్వయంగా ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లే చెప్పడం విశేషం. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్స్ సంఘం అధ్యక్షుడు డీ. కెంపన్న ..కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులపై ఆరోపణలు చేశారు. ఏ పనికైనా అధికారులు 40 శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. కాంట్రాక్టులు కట్టబెట్టాలంటే ముందే కమిషన్లు ఇవ్వాలని అప్పుడే పనులకు అనుమతులు వస్తాయని ఆయన బహిరంగ ప్రకటన చేయడం… కర్ణాటకలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగింది.స్థానిక కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అధికారులకు ప్యాకేజీలు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని చెబుతున్నారు. ఈ వసూళ్లలో సింహభాగం కాంగ్రెస్ పెద్దలకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు..పైగా అది బహిరంగ రహస్యమని అంటున్నారు.
అవినీతి ఆరోపణలతో అధికారానికి వచ్చి…
మునుపటి బసవరాజ్ బొమ్మాయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కమిషన్ ఇస్తేనే పనులు చేస్తారని ఆరోపించింది. పేటీఎం బ్యాచ్ అని, క్యూఆర్ కోడ్ అని ప్రచారం చేసింది. కన్నడ జనం ఆ మాటలు నమ్మారో లేదో చెప్పడం కష్టం. వేర్వేరు కారణాలతో బీజేపీ ఓటమి పాలైన మాట నిజం. భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పై అవే ఆరోపణలు వస్తున్నాయి.
ఎదురుదాడికి కాంగ్రెస్ ప్రయత్నం…
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సీఎం సిద్దరామయ్య ఆయన పరివారం ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. పనులు చేసే కాంట్రాక్టర్లే నేరుగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎవరికి డబ్బులిచ్చారు. ఎంతిచ్చారు అనేది చెప్పాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అది అంత సులభం కాదన్న ధైర్యంతో వాళ్లు మాట్లాడుతున్నారు. అయితే ఆరోపణలు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించే క్రమంగా సిద్దరామయ్య అలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ ఎక్కడున్నా కరెప్షన్ పార్టీనేనని కర్ణాటక బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇంతకాలం బీజేపీపై ఆరోపణలు చేస్తూ వచ్చిన కాంట్రాక్టలు ఇప్పుడు వాస్తవాలు వెల్లడిస్తున్నారని, కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.