అష్టాదశ శక్తిపీఠాల్లో 4 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి – మిగిలినవి కొలువైన క్షేత్రాలివే!

పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలు కొన్నింటిని శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో కూడా ఉన్నాయి.

అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలో అష్టాదశ శక్తి పీఠాలు
పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లిచేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని(పార్వతిని), అల్లుడు శివుడిని పిలవడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగంతో ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన కర్తవ్యాన్ని పక్కనపెట్టేశాడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి..శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. అలా శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా చెబుతారు.అప్పుడు కూడా ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు(శివుడు) తోడుగా దర్శనమిస్తాడు. అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

  1. శాంకరి – శ్రీలంక
  2. కామాక్షి – కాంచీపురం (తమిళనాడు)
  3. శృంఖల – ప్రద్యుమ్ననగరం ( కోల్ కతా సమీపంలో )
  4. చాముండి – క్రౌంచ పట్టణం ( మైసూర్)
  5. జోగులాంబ-అలంపూర్ (తెలంగాణ)
  6. భ్రమరాంబిక – శ్రీశైలం ( ఆంధ్రప్రదేశ్)
  7. మహాలక్ష్మి – కొల్హాపూర్ (మహారాష్ట్ర)
  8. ఏకవీరిక – మాహుర్యం ( మహారాష్ట్ర నాందెడ్ సమీపం)
  9. మహాంకాళి – ఉజ్జయిని ( మధ్యప్రదేశ్)
    10.పురుహూతిక – పిఠాపురం (ఆంధ్రప్రదేశ్)
  10. గిరిజ – ఒడిశా
  11. మాణిక్యాంబ -ద్రాక్షారామం (ఆంధ్రప్రదేశ్)
  12. కామరూప- గౌహతి ( అస్సాం)
  13. మాధవేశ్వరి -ప్రయాగ ( ఉత్తర ప్రదేశ్)
  14. వైష్ణవి – జ్వాలాక్షేత్రం (హిమాచల్ ప్రదేశ్)
  15. మంగళ గౌరి – గయ (బీహార్)
  16. విశాలాక్షి – వారణాసి
  17. సరస్వతి – జమ్ముకాశ్మీర్ ( పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరం)

ఆదిశంకరాచార్యులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు. అందుకే ఆ శక్తి క్షేత్రాలు అంత పవర్ ఫుల్…

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.