విపక్షాలు ఏకమవుతున్నట్లు కనిపిస్తాయి. ఆయా పార్టీల్లో వైరుధ్యాలు మాత్రం కొనసాగుతున్నాయి.కాంగ్రెస్ నేతృత్వ విపక్షాల కంటే ముందే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో సరికొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. భావసారూప్య పార్టీలను కలుపుకుని పోతున్న బీజేపీ .. తాను నడపించే ఎన్డీయేను పటిష్టం చేసే పనిలో ఉంది.
18న హస్తినలో మీటింగ్
విపక్ష పార్టీలు 17,19 తేదీల్లో బెంగళూరు వేదికగా తమ రెండో సమావేశాన్ని నిర్వహిస్తుండగా, ఎన్డీయే పెద్దల ఈ నెల 18న ఢిల్లీలో భేటీ అవుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు జరుగుతున్న ఈ భేటీకి ప్రధాని మోదీ స్వయంగా హాజరై భాగస్వామ్య పక్షాలకు దిశానిర్దేశం చేస్తారు. విపక్షాల అసత్య ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్టీయే సమావేశంలో అనేక కీలకాంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దేశం ఎలా ముందుకు సాగుతుందో కూడా మోదీ వివరిస్తారని చెబుతున్నారు.
పాత, కొత్తల కలయిక
ఎన్డీయేలోని పాత మిత్రులకు తోడు ఇప్పుడు కొత్త బృందాలు కూడా వచ్చి చేరుతూ మోదీ నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయి. అందులో మహారాష్ట్ర, బిహార్ కు చెందిన పార్టీలు ప్రధానంగా కనిపిస్తాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ గ్రూపు కూడా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందుకున్నాయి. ఢిల్లీ భేటీకి వారిద్దరూ హాజరవుతారని తెలుస్తోంది. ఇక బిహార్లో దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ను ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించారు. చిరాగ్ ఇటీవలి కాలంలో నిత్యానందరాయ్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ బీజేపీతో టచ్ లో ఉంటున్నారు.కీలకాంశాల్లో ఆయన బీజేపీకి మద్దతివ్వడమే కాకుండా ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కూడా సమావేశానికి హాజరవుతున్నాయి. హిందుస్థాన్ అవామ్ మోర్ఛాకు నాయకత్వం వహిస్తున్న మాంఝీ కొంతకాలంలో నితిశ్ కుమార్ కు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద 19 పార్టీలు ఈ సమావేశానికి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేశాయి.
పవన్ కు ఆహ్వానం, బాబుకు నో
ఎన్డీయే సమావేశంలో పాల్గొనాల్సిందిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. తాను వ్యక్తిగతంగా హాజరవుతున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. మరో పక్క చంద్రబాబును మాత్రం పిలవలేదు. తమకు కూడా పిలుపువస్తుందనే ఆశతో టీడీపీ వర్గాలు ఎదురు చూసినట్లుగా చెబుతున్నారు. కాకపోతే బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ చంద్రబాబును కాస్త దూరం పెట్టినట్లు చెబుతున్నారు. అలాగని భవిష్యత్తులో పొత్తు ఉండదని కూడా చెప్పలేం. అది చంద్రబాబు తీరుపై ఆధారపడి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.