రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటును ఉప సంహరించింది. వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు విధివిధానాలు ప్రకటించింది. చెలామణి కొనసాగుతుందని అంటూనే నోట్లు జమ చేసేందుకు గడువు పెట్టింది. దానితో సామాన్యుల వద్ద ఉన్న నోట్లతో పాటు బ్లాక్ మార్కెటీర్లు, కొన్ని అనుమానిత వర్గాల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లు బయటకు వస్తున్నాయి. భారీగా నగదును దాచుకున్న వాళ్లు గిలిగిలలాడుతున్నారు..
మావోయిస్టు సానుభూతిపరుల దగ్గర నోట్లు
చత్తీస్ గఢ్ లో ఇటీవల ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర ఆరు లక్షల రూపాయల విలువైన రూ.2 వేల రూపాయల నోట్లు స్వాధీనమయ్యాయి. బ్యాంకుల్లో మార్చుకునేందుకు తీసుకెళ్తున్నట్లు ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. మావోయిస్టు నేతలు తమకు ఆ నగదును ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. మహారాష్ట్రలోని ఎటపల్లి తాలూకా తోర్ గట్టా నుంచి భారీ నగదును మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ లోని సిల్గేరీకి తరలించినట్లు గుర్తించారు. భారీగా నగదును బ్యాంకులను తరలిస్తున్న సిల్గేరీ ఉద్యమ నేత ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు. మైనింగ్ మాఫియా నుంచి వసూలు చేసిన నగదును మార్చుకునేందుకు మావోయిస్టులు తొందర పడుతున్నారని సమాచారం..
డంపుల్లో భారీగా నగదు..
మావోయిస్టు పార్టీకి అడవుల్లో డంపులుంటాయి.డబ్బు మూటలను వాళ్లు భూమిలో దాచిపెడతారు. ఆయుధాలు, ఇతర వస్తువులతో పాటు నగదు కూడా డంపుల్లోనే ఉంచుతారు. ఇప్పుడు రూ.2 వేల నోటు ఉపసంహరణ కారణంగా భారీ సంఖ్యలో తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు మావోయిస్టులు నానా తంటాలు పడుతున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు మావోయిస్టులకు బాగా నష్టపోయారు. నగదు మార్చుకునే అవకాశాలు లేక నోట్లను పారెయ్యడం, తగులబెట్టడం లాంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడా దుస్థితి రాకుండా గిరిజనులకు నగదు ఇచ్చి బ్యాంకుల్లో మార్చుకు రావాలని ఆదేశించినట్లు ఛత్తీస్ గఢ్ పోలీసులు పసిగట్టారు.
పెరిగిన పోలీసు నిఘా
మావోయిస్టులు కాంట్రాక్టర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఖాకీలు గుర్తించారు. కాంట్రాక్టర్లు, గోదాముల ఓనర్లపై దాడులు చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులివ్వాలని వాళ్లు డిమాండ్ చేసి, బెదిరించి ఈ వేసవిలో బాగానే వసూలు చేశారని పోలీసులకు సమాచారం అందింది. అందులో రెండు వేల నోట్లే ఎక్కువగా ఉన్నాయని కాంట్రాక్టర్ల నుంచి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు చెబుతున్నారు. దానితో బ్యాంకులపై నిఘా పెట్టాలని స్థానిక పోలీసు స్టేషన్లకు ఆదేశాలందాయి. ఎవరైనా భారీ మొత్తంలో డబ్బులు మార్చుకునేందుకు వచ్చిన పక్షంలో తమకు ఉప్పందించాలని బ్యాంకు అధికారులను సైతం ఛత్తీస్ గఢ్ పోలీసు శాఖ ఆదేశించింది.
మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీసి, వారి ఆటకట్టించాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. గడ్చిరోలీ, గోండియా ప్రాంతంలో జన మిలీషియాపై నిఘా పెంచారు. మావోయిస్టులు తెలివిగా చిన్న మొత్తాలు 10 నుంచి 20 వేల రూపాయల రేంజ్ లో జన మిలీషియా చేత నగదు మార్పిడి చేయించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దండకారణ్య ప్రాంతమైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణలో సన్నగిల్లిన మావోయిస్టు కార్యకలాపాలను పెంచేందుకు వారికి ఆయుధాలు అవసరం. ఆ ఆయుధాలు కొనుగోలు చేయాలంటే అక్రమ ఆయుధాల విక్రేతలకు హార్డ్ క్యాష్ ఇవ్వాలి. అదే ఇప్పుడు మావోయిస్టులకు ఇబ్బందిగా మారింది. వారిని ఆ రూట్లోనే కొట్టాలని ఛత్తీస్ గఢ్ పోలీసులు డిసైడయ్యారు.