ఏపీలో 113 కేంద్ర ప్రాజెక్టులు – రూ. లక్షా 20 వేల కోట్ల ఖర్చు ! ఈ నిజాలు దాచిపెడుతోందెవరు ?

ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అభివృద్ధి పనులకు ఎంత ఖర్చు పెడుతోంది ? . పది లక్షల కోట్ల వరకూ అప్పులు చేసి.. ఎంత మేర అభివృద్ది చేసింది ? అంటే… ప్రతి పైసా ఇస్తామన్నా పోలవరం కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక ఇతర ప్రాజెక్టుల్ని ఎలా కట్టగలరు అనే సమాధానం వస్తుంది. కానీ కేంద్రం మాత్రం ఏపీలో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది . రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరుగుతూంటే అవి ఖచ్చితంగా కేంద్ర ప్రాజెక్టులే. రాష్ట్రం ఒక్క ప్రాజెక్టులు కూడా నిర్మించడం లేదు మరి.

కేంద్ర ప్రాజెక్టులు చకచకా !

సాగరమాల ప్రాజెక్ట్ కింద ఏపీలో 1,20,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కేంద్రం చేపట్టింది. మొత్తంగా 113 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇప్పటికే 36,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలినవి పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి. సాగరమాల ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నారు.

నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా పనులు

స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. విశాఖ పోర్ట్ అథారిటీ, జాతీయ రహదారుల అథారిటీ, పబ్లిక్ వర్క్స్, రైల్వేలు, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వంటివి ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీలో పూర్తయినవి కాకుండా రూ. 91,000 కోట్ల రూపాయలు విలువ చేసే 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పోర్టుల ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు, పరిశ్రమల అభివృద్ధి, కోస్తా తీర ప్రాంతాల అభివృద్ధి.. వంటి 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అలాగే 17,741 కోట్ల రూపాయలతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలో ఉన్నాయి. 73,527 కోట్ల రూపాయలతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నాయి.

రైల్వే ప్రాజెక్టులు కడతామన్నా పట్టించుకోని కేంద్రం

ఏపీలో ప్ర‌స్తుతం రూ.70 వేల కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన రైల్వే ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయి. చాలా పనులకు సబంధించి రాష్ట్ర సహకారం అవసరం . కానీ రైల్వే ప్రాజెక్టులే వద్దన్నట్లుగా ఏపీ తీరు ఉంది. రైల్వే శాఖ కొత్త ప్రాజెక్టుల‌ను కాస్ట్ షేరింగ్ ప‌ద్ద‌తిన చేప‌డుతోంది. ఇందులో భాగంాగ రైల్వే ప్రాజెక్టులకు ఏపీ నిధులను కేటాయించడం లేదు. కేవలం రూ.1,798 కోట్లు చెల్లిస్తే.. అంతకు ఇరవై రెట్లు ఎక్కువ నిధులను పొందవచ్చు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆ కొద్ది మొత్తం ఇవ్వడానికి ఇష్టం లేకుండా పోయింది.