ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేరంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించారు. ఈ మహాక్రతువు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే భారతీయ రైల్వేశాఖ వెయ్యి రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది..పూర్తి వివరాలివే…
అయోధ్య రాముడు 2024 లో తన జన్మభూమిలో కొలువుతీరనున్నాడు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దేశంలోని నలు మూలల నుంచి ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరుకానున్నారు. యూపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన పూర్తైన తర్వాత కొన్ని రోజుల పాటూ భక్తుల రద్దీ విపరీతంగా ఉండబోతోంది. అందుకే రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల కోసం 100 రోజుల పాటూ స్పెషల్ ట్రైన్స్ నడపనుంది రైల్వే శాఖ. దేశంలోని పలు చోట్ల నుంచి 1000 రైళ్లు అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 19 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కత్తా, నాగ్‌పూర్, లక్నో, జమ్ము నుంచి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే.
అయోధ్యలోని స్టేషన్ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులకు అనుగుణంగా పునరుద్ధరించారు. రోజుకు దాదాపు 50,000 మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది జనవరి 15 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని అధికారులు చెప్పారు. కొన్ని రైళ్లను యాత్రికుల బృందాలు కూడా అయోధ్యకు చార్టర్డ్ సర్వీస్‌గా బుక్ చేస్తున్నాయి. IRCTC కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు సందర్శించే ఈ 10-15 రోజులలో క్యాటరింగ్ సేవలను అందించడానికి కూడా సిద్ధమవుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తుంది. రాముడి జన్మస్థలాన్ని సందర్శించే యాత్రికులకు పవిత్ర సరయూ నదిపై అదనపు ఆకర్షణగా ఎలక్ట్రిక్ బోటు ప్రయాణం. ఇందులో 100 మంది వ్యక్తులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని ఉంటుంది.
2024 జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఆలయ గర్భగుడి వద్ద రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్యామశీల నిర్మించారు. జనవరి 23 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.