తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఒక్క పూటలోనే ముగిసింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన కేసీఆర్ ఆ కార్యక్రమం పూర్తవగానే మళ్లీ హైదరాబాద్ వచ్చేశారు. కేసీఆర్ అసలు తాను ఢిల్లీకి వచ్చాననే విషయం ఎవరికీ తెలియకూడదన్నట్లుగా వ్యవహరించారు. ఇలా ఎందుకు అన్నది ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాలేదు. బీజేపీ నేతలు ఎక్కడ కన్నెర్ర చేస్తారోనన్న భయంతో ఆయన తీరు ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
భయం భయంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు
కేసీఆర్ రెండో తేదీనే ఆయన ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణఆలతో ఆగిపోయారు. అవేంటో తెలియదు.ఢిల్లీలోల పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారని.. మేధావులతో చర్చలు జరుపుతారని.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో .. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని అనుకున్నారు. కాన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే రోజు అయిన నాలుగో తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. తన చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించి.. లంచ్ సమయం అయిన వెంటనే వెనుదిరిగారు. ఎవరితోనూ సమావేశం కాలేదు. మామూలుగా గురువారం అంతా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీలో ఉండాలనుకోలేదు.
మీడియాలో పబ్లిసిటీ వద్దే వద్దనుకున్న కేసీఆర్ !
జాతీయ పార్టీ అయిన తర్వాత జాతీయ పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా జరపాలని అనుకున్న కేసీఆర్ పూర్తిగా చల్లబడిపోయారు. సాదాసీదాగా ఆపీసును రిబ్బన్ కటింగ్ చేసి.. వెంటనే హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు. కేసీఆర్ అసలు ఢిల్లీలో ఉండేందుకే ఇష్టపడకపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సారి ఏ ఒక్క ఇతర పార్ట నేతను కూడా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. ఇంకా చెప్పాలంటే అసలు మీడియాను కూడా పిలువలేదు. వచ్చిన మీడియాను కూడా రోడ్డు మీదకు గెంటేశారు. అసలు మీడియా కవరేజీ ఇస్తే సమస్య ఏమిటన్నది కూడా చాల మందికి అర్థం కాలేదు.
కవిత కూడా కనిపించలేదు !
కేసీఆర్ జాతీయ రాజకీయాల్ని కవిత సమన్వయం చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకే కాదు.. ఏ ఇతర రాష్ట్రానికి వెళ్లినా ముందుగా పనులన్నీ కవితే చక్కబెడతారు. కానీ ఈసారి కవిత కనిపించలేదు. కేటీఆర్ మాత్రం వచ్చారు.. వెళ్లారు. కవిత తనకు కాలు బెణికిందని నెల రోజులుగా బయట కనిపించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ బీజేపీపై విమర్శలు తగ్గించేశారు. జాతీయ రాజకీయాలు చేయడం దాదాపుగా ఆపేశారు. మామూలుగా ఢిల్లీ వచ్చి దడదడలాడిస్తానని కేసీఆర్ చెబుతూ ఉంటారు. కానీ ఆయన అక్కడ ఉండటానికి కూడా ఇబ్బంది పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలు పార్టీ విస్తరణ గురించే ఇటీవలి కాలంలో పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో కేసీఆర్ చేతులెత్తేశారన్న భావన అందరిలో ఏర్పడుతోంది.