ఎన్నికల సమీపిస్తుండడంతో కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల బాట పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోని నేతలు తీరిగ్గా ఇప్పుడు జనం సమస్యలను తెలుసుకుంటున్నారు. క్యాంపు కార్యాలయాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అమరావతి, విశాఖ వంటి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కాలం గడిపిన నేతలు ప్రజలు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓట్ల కోసం ఎన్నికల ముందు వస్తారు, ఆ తర్వాత పట్టించుకోరన్న నానుడిని నిజం చేస్తూ టెక్కలి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గ్రామాలను చుట్టుముడుతున్నారు. కానీ ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.
కష్టాలను పట్టించుకోని అచ్చన్న
సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పోర్టు కోసం రైతులు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూములను తీసుకుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఇళ్లు, పశువుల శాలలు తదితర స్ట్రక్చర్ల విలువ కోసం పోలీసు బలగాలను పెట్టి బలవంతంగా చేయించారు. పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై బైండోవర్ కేసులు సైతం నమోదు చేశారు. పోర్టుకు భూములు ఇవ్వని వారి పంటలను బుల్డోజర్లతో తొక్కించారు. ఇంత జరిగినా టెక్కలి ఎమ్మెల్యే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏనాడూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ చర్యలపై ఆ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ప్రశ్నించడం, అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఉంటే నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు కొంతవరకైనా నెరవేరేవన్న చర్చ అప్పుట్లో సాగింది .
బాధితుల్ని పరామర్శించలేదు
మృత్యువాత పడినా దిక్కు లేని పరిస్థితిటెక్కలి పాతబస్టాండ్ సమీపంలో గతేడాది అక్టోబర్ 16న పోర్టు వాహనం ఢకొీని శ్రీరామ కాలనీకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. టెక్కలి మండలం నారాయణపురం వద్ద గతేడాది డిసెంబర్ 22న పోర్టు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన శేషు అనే యువకుడు మృతి చెందాడు. కాంట్రాక్టు పనులు పర్యవేక్షిస్తున్న వైసిపి టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రూ.మూడు లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినా బాధిత కుటుంబం తిరస్కరించింది. గతేడాది ఆగస్టు 14న సంతబొమ్మాళి మండలం హనుంతనాయుడుపేట పంచాయతీ సీతారాంపురానికి చెందిన లక్ష్మీనారయణ పోర్టు నిర్మాణ పనులు చేసేందుకు వెళ్తున్న క్రమంలో పోర్టుకు చెందిన టిప్పరు ఢకొీనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరంతా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన బాధితులే. వీరికి పరిహారం చెల్లించాలనే డిమాండ్‌నూ ప్రభుత్వం ముందుంచలేదు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించనూ లేదు.కరువుతో అల్లాడుతున్నా కదల్లేదు.
సాగునీరు కోసం ప్రయత్నించలేదు
టెక్కలి, నందిగాం మండలాల్లో శివారు ప్రాంతాలకు వంశధార నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయాయి. గతేడాది ఖరీఫ్‌లో నందిగాంలో 3,800 ఎకరాలు, సంతబొమ్మాళి మండలంలో 968 ఎకరాలు ఎండిపోయాయి. ఈ సంవత్సరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. కొన్నిచోట్ల వేసిన పంటలూ ఎండిపోయాయి. మండలంలోని పలు ఎత్తిపోతల పథకాలకు నీరు ఆపేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలోనూ పెద్దగా స్పందించలేదు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు సైతం ఎమ్మెల్యేకు తీరిక లేకపోయింది.తీరిగ్గా పలకరింపులు.. పరామర్శలుటిడిపి అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి చాలా తక్కువ సమయం కేటాయించారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తూండటంతో ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.