ఉత్తరాదిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యను ఆధునిక ఆధ్యాత్మిక నగరంగా, ఆర్ధిక పరంగా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు దక్షిణాదిన ఒడిశాకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నట్టున్నాయి. అందుకే పూరీని మరో అయోధ్యలా మార్చేందుకు సన్నాహాలు చేస్తోందట ఒడిశా సర్కార్…
ప్రపంచ వారసత్వ నగరంగా పూరీ!
రాబోయే రోజుల్లో పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా కూడా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా తమ ప్రభుత్వం మాత్రం ఇది పూర్తయ్యే వరకూ ఆగేది లేదన్నారు. పూరీలో త్వరలో కొత్త విమానాశ్రయం వస్తుందని, రాజధాని భువనేశ్వర్ కూ, పూరీకి మధ్య 8 లైన్ల హైవే కూడా వస్తుందన్నారు. మెట్రో రైలును కూడా పూరీ వరకూ పొడిగించాలన్నది నవీన్ పట్నాయక్ సర్కార్ ప్లాన్. దీనిపై విపక్షాల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు నవీన్ పట్నాయక్. ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.
మోదీ స్ఫూర్తితో
రాజకీయాల సంగతి పక్కనపెడితే ఆధ్యాత్మికంగా ఒక్కో ఆలయాన్ని అభివద్ధి చేయడం మంచిదే అన్నది హిందువుల భావన. అభివృద్ధి విషయంలో పోటీపడితే అంతకుమించి ప్రజలకు కావాల్సింది ఏముంటుంది. అయోధ్యలో రాముడు కొలువుతీరిన సందర్భంగా దేవాలయాలను మరింత అభివృద్ధి చేయడం మంచి విషయమే. ఇప్పటికే సీఎం నవీన్ పట్నాయక్ పూరి జగన్నాథుడి గుడి కారిడార్ డెవలప్ చేశారు. ఈ మధ్యే దాన్ని ప్రారంభించారు కూడా…తద్వారా ఒడిశాకు భక్తి పర్యాటకులు పెరుగుతారని ఆయన విశ్వాసం. ఏదేమైనా మోదీ హయాంలో అయోధ్య వెలుగులు చూసిన తర్వాత మిగిలిన ఆలయాల అభివృద్ధిపైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టడం మంచివిషయమే…
పురాణకాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాధునిగా సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు.