పలాసలో అప్పల్రాజు చేతులెత్తేశారా ? డబ్బులు నొక్కేశారన్న ఆరోపణలు ఎందుకు ?

శ్రీకాకుళం జిల్లా లో ఉన్న నియోజకవర్గాల్లో పలాసపైనే అందరి దృష్టి ఉంది. గత ఐదేళ్లుగా ఈ నియోజకవర్గంలో రాజకీయం గరం గరంగానే ఉంది. నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతో అక్కడ పొలిటికల్ డైలాగ్ వార్ నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చింది. ఓ వైపు మంత్రి సీదిరి అప్పలరాజు మరో వైపు టీడీపీ అభ్యర్ధిని గౌతు శిరీషాకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో ఈ సారి ఎన్నికలలో గత సారి కంటే పోలింగ్ శాతం పెరగడంతో పలాస ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తి రేపుతుంది.

పలాసలో పెరిగిన పోలింగ్

గత ఎన్నికల్లో అప్పలరాజు సుమారు 16 వేల మెజార్టీతో గెలిచారు .. 72.9 శాతం పోలింగ్ జరిగిన2019 ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఓట్ల చీలిక అప్పలరాజుకుకి ప్లస్ అయింది. అయితే ఈ సారి కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష తిరిగి పోటీ చేయడం కలిసి వస్తుందంటున్నారు. ఈసారి అక్కడ 76.42 శాతం పోలింగ్ నమోదు అయింది. సుమారు 3.07 శాతం అధికంగా ఓటర్లు తమ ఓటును వినియోగించు కున్నారు. అదంతా ప్రభుత్వ వ్యతిరేకతేనని దానికి తోడు మంత్రి అప్పలరాజు వైఖరితో నియోజకవర్గ వాసులు విసిగిపోయి ఉన్నారని ఈ సారి తమ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

డబ్బులు పంచలేకపోయిన అప్పలరాజు

అదీకాక ఈ సారి మంత్రి సిదిరి అప్పలరాజుకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ఆయన్ని డబ్బుల పంపకంలో బోల్తా కొట్టించారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు కి అత్యంత నమ్మకంగా ఉన్న నలుగురి ప్రధాన వ్యక్తులే ఆ డబ్బులు పంచకుండా నొక్కేశారని వైసీపీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిదిరి అప్లలరాజు పలాస లో అనేక ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రి అయిన తరువాత భూముల ఆక్రమణలతో పాటు సూది కొండ, నెమలి కొండలను కూడా నిబంధనలకి విరుద్ధంగా తవ్వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. పలాసలో గౌతు శిరీషా కొత్తగా సొంత ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తే దానికి కూడా మంత్రి అప్పల రాజు అనేక అడ్డంకులు సృష్టించారు. ఇవననీ మైనస్ గా మారాయి.

వైసీపీకి దూరమైన పలువురు నేతలు

తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన దువ్వాడ శ్రీకాంత్, హేమబాబుచౌదరి లను పక్కన పెట్టడం కూడా ఈ సారి ఎన్నికలో అప్పల రాజుకి నెగిటివ్ అవుతుందని రాజకీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అప్పలరాజుకి టికెట్ దక్కేలా చేయడంలో దువ్వాడ శ్రీకాంత్, వివేకానంద విద్యాసంస్థ అధినేత మెట్ట కుమారస్వామి కీరోల్ పోషించారు .. అయితే అప్పల రాజు మంత్రి అయిన తరువాత దువ్వాడ శ్రీకాంత్‌ని పక్కనపెట్టేశారు. స్థానికంగా బలమైన అనుచరవర్గం ఉన్న దువ్వాడ శ్రీకాంత్ పలాసకు చంద్రబాబు వచ్చినప్పుడు అనుచరవర్గంతో పసుపు కండువా కప్పుకున్నారు.
దువ్వాడ శ్రీకాంత్ ఎఫెక్ట్‌తో అప్పలరాజుకి పలాసలో పెద్ద దెబ్బే పడుందంటున్నారు .. ఎన్నికల ముందు వరకు అప్పలరాజు విజయావకాశాలపై పాజిటివ్ టాక్ వినిపించింది.. అయితే దువ్వాడ శ్రీకాంత్, హేమబాబుచౌదరిలు టీడీపీలో జాయిన్ అయి గౌతు శిరీషకు మద్దతు ప్రచారం చేయడంతో.. అప్పలరాజు గెలుపు కష్టమేనంటున్నారు.