రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సీన్లో రెండు పార్టీలు సీరియస్ గా దృష్టి పెడుతున్నాయి. ఒక పార్టీ స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే, మరో పార్టీ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది.బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎట్టి పరిస్థితుల్లో రాజస్థాన్లో కొన్ని సీట్లు గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పరిమిత స్థాయిలో పోటీ చేస్తూ ఆ రాష్ట్రంలో నిలబడే ప్రయత్నంలో ఉన్నారు….
30 చోట్ల ఎంఐఎం పోటీ…
ఎంఐఎం ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హవా మహల్, కమాన్, ఫతేపూర్ నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఆ మూడు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 30 చోట్ల పోటీ చేసి గరిష్టంగా విజయం సాధించాలని ఎంఐఎం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 21న రాజస్థాన్ వెళ్లే ఒపైసీ అక్కడ రెండు రోజులు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నవంబరు 23న ప్రచారం ముగిసే లోపు కనీసం నాలుగు సార్లు రాజస్థాన్లో పర్యటించాలని ఒవైసీ భావిస్తున్నారు…
అభివృద్ధికి నోచుకోలేదంటున్న ఒవైసీ
రాజస్థాన్లో ముస్లింలు అభివృద్ధికి నోచుకోలేదని అందుకే తాము రంగంలోకి దిగాల్సి వస్తోందని ఒవైసీ చెబుతున్నారు. రాజస్థాన్, తెలంగాణలో ముస్లిం జనాభా దాదాపుగా సమానంగా ఉందని , రెండు చోట్ల 13 శాతం మంది జనాభా ఉన్నారని ఆయన గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో ముస్లిం సంక్షేమానికి రూ. 2,500 కోట్లు ఖర్చు చేస్తుంటే.. రాజస్థాన్లో కేవలం రూ. 250 కోట్లు వ్యయం చేస్తున్నారని ఆయన లెక్కలు చెబుతున్నారు. ఐఎంఐ రాజస్థాన్ యూనిట్ 2020 మే నెలలో ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పోటీ చేయలేదు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ బరిలోకి దిగుతోంది . అయతే బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అని ఓట్లు చీల్చి కమలం పార్టీకి ప్రయోజనం కలిగించే ప్రయత్నంలో ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
బలం పెంచుకునేందుకు బీఎస్పీ ప్రయత్నం
కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాయావతి.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలతో మళ్లీ ఫార్మ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 1998 నుంచి ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ.. 2008లో అత్యధికంగా 7.6 శాతం ఓట్లు సాధించారు. పార్టీ తరపున గెలిచిన వాళ్లు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. 2013లో ఆ పార్టీకి 3.4 శాతం ఓట్లతో మూడు స్థానాలు దక్కాయి. 2018లో నాలుగు శాతం ఓట్ షేర్ తో ఆరు సీట్లు సొంతం చేసుకుంది. ఆరుగురు కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోయారు. ఈ సారి మొత్తం 200 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్న బీఎస్పీ…. కనీసం 60 చోట్ల తాము బలంగా ఉన్నామని విశ్వసిస్తోంది.నవంబరు 17 నుంచి 20 మధ్యకాలంలో మాయావతి ఎనిమిది బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.తాము ఎవ్వరినీ ఓడించడానికి బరిలోకి దిగడం లేదని, తాము గెలిచి చూపించేందుకే నామినేషన్లు వేస్తున్నామని బీఎస్పీ నేతలు చెబుతున్నారు.