ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. చంద్రగిరిలోని సీనియర్ నాయకుడు అయిన ఎమ్యార్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దానికి కారణం ఆయన టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానికి సహకరించారని చెప్తున్నారు. ఎమ్మార్సీ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు.. గతంలో ఎమ్మెల్సీ కోసము ప్రయత్నించారు. అయితే దానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో ఈ సారి ఎన్నికలలో చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెర్సీ రెడ్డి వర్గం పనిచేసిందని అంటున్నారు.
కుమారుడి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన చెవిరెడ్డి
సొంత మండలం ఎర్రవారిపల్లితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మార్సీ రెడ్డి చెవిరెడ్డి వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి టీడీపీకి అనుకూలంగా పనిచేయించారని అంటున్నారు. చెవిరెడ్డి ఈసారి చంద్రగిరిలో గెలుపుపై ధీమాతో తన కుమారుడు మోహిత్‌రెడ్డికి వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. తాను ఒంగోలు ఎంపీగా పోటీలో ఉన్నా.. చంద్రగిరిపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేసి ప్రచారంలో తనదైన మార్క్ చూపించారు. తన రాజకీయ గురువు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మంత్రి రోజా ఇలా తిరుపతి జిల్లా ముఖ్యనేతలందరితో ఆత్మీయసమావేశాలు పెట్టి చెవిరెడ్డి తన కుమారుడి విజయం కోసం కృషి చేశారు.
భారీగా తగ్గిన పోలిగ్
కష్టపడిన చెవిరెడ్డి చంద్రగిరిలో పోలింగ్ తర్వాత పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో గ్రౌండ్ లెవల్లో ఏం జరిగిందనే దానిపై పోస్ట్ మార్టం నిర్వహించారు. గత ఎన్నికల్లో చెవిరెడ్డి మార్క్ పోల్ మేనేజ్‌మెంట్ పనిచేసి 89 శాతం పోలింగ్ నమోదైంది. అది ఈ సారి 79.89 శాతానికి తగ్గిపోయింది. దాంతో సమీక్షించుకున్న ఆయన ఆశించిన స్థాయితో ఓటర్లు బూత్‌లకు రాకపోవడానికి నమ్ముకున్న కేడరే కారణమని భావిస్తున్నారంట. ఆ క్రమంలోనే ఎమ్మార్సీ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందంటున్నారు.
రోజాకు కూడా సొంత నేతల నుంచే ిబ్బంది
నగరి నియోజకవర్గంలో కూడా వెన్నుపోటు రాజకీయం అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరున్న కెజె కూమార్ వర్గం పార్టీలో ఉంటూ రోజాకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా.. టీడీపీకి ఓటు వేయమని చెప్పారని సాక్షాత్తు మంత్రి రోజా నే తమ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అంతకు ముందు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కోసం చంద్రగిరి సభలో పాల్గొన్నప్పుడు ఆమె విజయంపై ఒక రేంజ్లో ధీమా వ్యక్తం చేశారు. అంత ధీమాగా కనిపించిన రోజా పోలింగ్ ముగియగానే ఢీలా పడిపోయినట్లు కనిపించారు. నగరిలో తనను సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని సొంత మీడియా ముందు వాపోయారు. మరోవైపు పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు సీనియర్లు పార్టీ నుంచి బయటకు పోయి టిడిపికి మద్దతు ప్రకటించడం వెనుక కూడా వైసీపీ సీనియర్ల హాస్తం ఉందన్న ప్రచారం జరుగుతుంది.